కార్పొరేట్‌కు భోగం | - | Sakshi
Sakshi News home page

కార్పొరేట్‌కు భోగం

May 10 2026 7:58 AM | Updated on May 10 2026 7:58 AM

కార్పొరేట్‌కు భోగం

పరీక్షల పేరుతో రోగుల నుంచి దోపిడీ చిన్నపాటి జ్వరానికి అనవసర పరీక్షలు స్కానింగ్‌, ల్యాబ్‌ల నిర్వాహకులతో వైద్యుల ‘కమీషన్‌’ ఏర్పాట్లు రోగిని చూడకముందే ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్‌లకు సిఫార్సు పేద, మధ్యతరగతి కుటుంబాలపై పెరుగుతున్న ఆర్థిక భారం చంద్రబాబు పాలనలో ప్రభుత్వ వైద్యశాలల్లో అందని ద్రాక్షగా సేవలు ప్రైవేట్‌ ఆస్పత్రుల దోపిడీపై ప్రభుత్వ నియంత్రణ కరువు

పేదోడి రోగం..

‘‘ఏంటి సార్‌ దగ్గుతున్నారు.. మీరు కూడా కొన్ని టెస్ట్‌లు చేయించుకోండి’’.. అంటూ ఠాగూర్‌ సినిమాలో ఓ సీన్‌ కార్పొరేట్‌ ఆస్పత్రుల దోపిడీకి అద్దం పడుతుంది. కేవలం పొడి దగ్గుకే టెస్టుల పేరిట దోచుకునే తీరు పల్నాడు జిల్లాలోకి కొన్ని కార్పొరేట్‌ వైద్యశాలల్లోనూ కనిపిస్తోంది. కాలిలో ముల్లు గుచ్చుకుంటే కంటి వరకు టెస్టులు చేయిస్తూ పేదల స్థోమతకు పరీక్ష పెడుతున్నారు. ఆస్పత్రి గడప తొక్కితే చాలు రోగం తగ్గడం సంగతి దేవుడెరుగు అప్పుల మూట గుండెలపై గుదిబండగా మారుతోంది. స్కానింగ్‌లు, రక్త పరీక్షల ల్యాబ్‌తో కుమ్మకై ్కన వైద్యుల తీరు రోగుల జేబులకు చిల్లు పెడుతోంది. ప్రభుత్వ వైద్యశాలల్లో సేవల అందక కార్పొరేట్‌ ఆస్పత్రుల వారు పేద, మధ్య తరగతి వారిని దోచుకుంటున్నారు.

నరసరావుపేట టౌన్‌: ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రికి వెళ్లిన రోగికి చికిత్స కంటే ముందే భారీ బిల్లులు భయపెడుతున్నాయి. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో కొన్ని ప్రైవేటు వైద్యశాలల్లో పరిస్థితి రోజురోజుకూ తీవ్ర రూపం దాల్చుతోంది. ప్రభుత్వ వైద్యశాలల్లో సరైన సౌకర్యాలు, నిపుణుల కొరత కారణంగా ప్రజలు ప్రైవేటు ఆస్పత్రుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ పరిస్థితిని కొందరు కార్పోరేట్‌ వైద్యసంస్థలు వ్యాపారంగా మార్చుకుంటున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణ జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులతో ఆస్పత్రికి వెళ్లిన రోగులకు అవసరం లేని వైద్య పరీక్షలు రాస్తూ రూ.వేల నుంచి రూ.లక్షల వరకు బిల్లులు వేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రైవేట్‌ ఆస్పత్రులు, ల్యాబ్‌లు, స్కానింగ్‌ సెంటర్ల మధ్య కమీషన్‌ వ్యవస్థ కారణంగా రోగుల జేబులు ఖాళీ అవుతున్నాయి.

జ్వరానికి రూ. 1.5 లక్షల బిల్లు..

నరసరావుపేటకు చెందిన శ్రీనివాస్‌ జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధపడుతూ పట్టణంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరారు. సాధారణ చికిత్సతో తగ్గే సమస్య అయినప్పటికీ అతడికి వరుసగా దాదాపు పది రకాల రక్త పరీక్షలు, స్కానింగ్‌లు, ఇతర నిర్ధారణ పరీక్షలు సూచించారు. వారం రోజుల చికిత్స అనంతరం ఆస్పత్రి బిల్లు రూ.1.50 లక్షలు కావడంతో కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. పరీక్షల పేరుతో భారీ మొత్తం వసూలు చేశారని వారు ఆరోపిస్తున్నారు.

వ్యాపారంగా మారిన వైద్యం

రోగి పరిస్థితిని పరిశీలించి అవసరమైన పరీక్షలు మాత్రమే సూచించాల్సిన వైద్య విధానం ప్రస్తుతం వ్యాపారంగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొంతమంది వైద్యులు రోగి లక్షణాలు పూర్తిగా తెలుసుకోకుండానే వరుస పరీక్షలు రాస్తున్నారని ఆరోపణలు లేకపోలేదు. ముఖ్యంగా ఎంఆర్‌ఐ స్కాన్‌, సిటీ స్కాన్‌, థైరాయిడ్‌, విటమినన్‌ టెస్టులు, హార్మోనన్‌, పూర్తి రక్తపరీక్షలు, 2డీ ఈసీజీ, ఎకో పరీక్షలు, ఇలా అవసరం ఉన్నా లేకపోయినా పెద్ద జాబితా ఇస్తూ రోగులను ఆర్థికంగా దెబ్బతీస్తున్నారని పలువురు వాపోతున్నారు.

రోగిని చూడకుండానే ‘అసిస్టెంట్ల’ దందా

కొన్ని ఆస్పత్రుల్లో వైద్యుడిని కలిసే ముందు అక్కడి సిబ్బందే పరీక్షల జాబితా తయారు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రోగి సమస్య ఏంటో పూర్తిగా తెలుసుకోకుండానే వివిధ టెస్టులు సూచిస్తూ రూ.వేలు వసూలు చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. కొన్ని చోట్ల వైద్యుడిని కలిసే అవకాశమే లేకుండా ముందుగానే ల్యాబ్‌, స్కానింగ్‌ సెంటర్లకు పంపిస్తున్నారు. ఇది వైద్య నైతిక విలువలకు విరుద్ధమని ప్రజలు మండిపడుతున్నారు.

గర్భిణులకు ప్రైవేట్‌ స్కానింగ్‌లు

నరసరావుపేట ఏరియా వైద్యశాలలో రేడియాలజిస్ట్‌ అందుబాటులో లేకపోవడంతో గర్భిణులకు అవసరమైన స్కానింగ్‌ పరీక్షలు బయట ప్రైవేట్‌ సెంటర్లలో చేయించుకోవాల్సి వస్తోంది. ప్రైవేట్‌ స్కానింగ్‌ సెంటర్ల నిర్వాహకులు కమీషన్‌లు ఇస్తుండటంతో అవసరం లేకున్నా వైద్యులు స్కానింగ్‌ పరీక్షలు రాస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గర్భధారణ సమయంలో కనీసం మూడు నుంచి నాలుగు స్కానింగ్‌లు అవసరం అవుతాయి. ప్రతి స్కానింగ్‌కు రూ.వేల ఖర్చు కావడంతో పేద కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. కొన్నేళ్లుగా రేడియాలజిస్ట్‌ పోస్టు భర్తీ చేయకపోవటంతో ప్రభుత్వ తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

జిల్లా కలెక్టర్‌ జోక్యం అవసరం..

ప్రైవేట్‌ ఆస్పత్రులు, ల్యాబ్‌లు, స్కానింగ్‌ సెంటర్లలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని ప్రజల నుంచి డిమాండ్‌ వ్యక్తం వస్తోంది. అనవసర పరీక్షలపై విచారణ, ఫీజుల నియంత్రణ, కమీషన్‌ వ్యవస్థపై దృష్టి సారించాలి. నిబంధనలు ఉల్లంఘించిన ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవటంతోపాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో రేడియాలజిస్టుల నియామకం చేపట్టాలి. ఈ వ్యవహారాలపై పల్నాడు జిల్లా కలెక్టర్‌ తక్షణమే దృష్టి సారించాలని బాధితులు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement