మండలానికి ఒక టీడీపీ నాయకుడి చేతిలో పెత్తనం గోడౌన్ నుంచి డీలర్‌కు చేరేలోపే మాయమవుతున్న బియ్యం మాఫియా పేరు చెబితేనే భయపడుతున్న రేషన్ డీలర్లు చర్యలు తీసుకోవాల్సిన అధికారులూ కుమ్మక్కు కావడంతో ఇబ్బందులు మంత్రి ఇలాకాలోనే యథేచ్ఛగా సాగుతున్న అక్రమాలు
బస్తాల్లోనూ తరుగే
గుంటూరు జిల్లాలో రేషన్ మాఫియా అక్రమాలకు అడ్డూఅదుపు లేకుండాపోతోంది. ప్రతి నియోజకవర్గంలో మండలానికి ఒక టీడీపీ నేత రేషన్ మాఫియా నిర్వహణను పంచుకున్నారు. గుంటూరు నగరంలో, రూరల్ మండల పరిసరాల్లో అధికార పార్టీకి చెందిన వ్యక్తి చేతుల్లో రేషన్ మాఫియా నడుస్తోంది. ఎంఎల్‌ఎస్ పాయింట్ నుంచి రేషన్ డీలర్‌కు చేరేలోగానే బియ్యాన్ని మాఫియా దోచేస్తోందని డీలర్లే బాహాటంగా ఆరోపిస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, గుంటూరు: జిల్లాలో అక్రమ రేషన్ దందాకు అంతులేకుండా పోయింది. ముఖ్యంగా మురళి.. ఈ పేరు చెబితేనే ప్రతి రేషన్ డీలర్ భయపడుతున్నాడంటే మాఫియా ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతోంది. బియ్యం గోడౌన్ నుంచి లారీ బయలుదేరగానే సంబంధిత అధికారులు ఆ వ్యక్తికి సమాచారం ఇస్తారు. వెంటనే ఆ వ్యక్తి తమ మాఫియా గణంతో ఆయా డీలర్లకు ఆదేశాలు జారీ చేస్తాడు. తమ వాహనాల్లో ఇన్ని బస్తాలు లోడు చేయాలని ఆదేశిస్తాడు. అతని మాట ఎవరైనా వినకుంటే రోజుల వ్యవధిలో అధికారులు ఆయా షాపుల్లో తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తారు. చేసేది లేక ఆ వ్యక్తి చెప్పినట్లుగానే లబ్ధిదారులకు బియ్యం ఇచ్చినా ఇవ్వకపోయినా అతని వాహనాల్లో చెప్పినన్ని బస్తాలు లోడు చేసి పంపాల్సిందే.
డిప్యూటీ తహసీల్దార్లపై ఆరోపణలు
పేదలకు ఆహార పదార్థాలను సరఫరా చేయాల్సిన పౌరసరఫరాల శాఖ ప్రస్తుతం అవినీతి కుంపటిలో కూరుకుపోయింది. కింది స్థాయి నుంచి మొదలుకొని పైస్థాయి అధికారి వరకు తిలా పాపం తలా పిడికెడు అన్నట్లు కొనసాగుతోంది. జిల్లాలో మొత్తం 5,90,546 రేషన్ కార్డులున్నాయి. 972 డిపోల ద్వారా ప్రతి నెలా సుమారు 10 వేల మెట్రిక్ టన్నుల బియ్యంతోపాటు పంచదార, గోధుమ పిండి సరఫరా చేస్తారు. మొదటి 15 రోజులు ఈ రేషన్ పంపిణీ చేయాల్సి ఉంటుంది. చాలా రేషన్ దుకాణాల్లో కొలతల వ్యత్యాసం ఉంటుంది. దీనిని సివిల్ సప్లైస్ అధికారులు పట్టించుకోరు. దానికిగాను కొన్ని రేషన్ దుకాణాల నుంచి ప్రతి నెలా రూ.1,000 నుంచి రూ.1,500 వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. జిల్లాలో ఏడుగురు డిప్యూటీ తహసీల్దార్లు ఉన్నారు. గతంలో వెస్ట్ డీటీ మొహమ్మద్ ఖాదర్ బాషాపై ఓ రేషన్ దుకాణదారుడు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశాడు. అయినా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇటీవల ఈస్ట్ డీటీపైనా ఫిర్యాదులు అందాయి. ఇలా మరికొందరిపైనా నిత్యం ఏదో ఒక సమయంలో ఫిర్యాదులొస్తున్నా అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. జిల్లా అధికారి దీర్ఘకాలిక సెలవులో వెళ్లినా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకపోవడంతో కిందిస్థాయి అధికారుల ఇష్టారాజ్యంగా మారింది. జిల్లాకు చెందిన నాదెండ్ల మనోహర్ పౌరసరఫరాల శాఖ మంత్రి ఉండగానే ఈ స్థాయిలో అక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు ఈ శాఖపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
రేషన్ గోడౌన్‌ల నుంచి డీలర్లకు వచ్చే బియ్యం బస్తా ఒకొక్కటి 50 కిలోలు ఉండాలి. కానీ 40, కిలోలు, ఇంకా కొన్నింటిలో 35 కిలోలు ఉంటున్నాయని డీలర్లు వాపోతున్నారు. తమకు వచ్చే బియ్యంలోనే కోతలు వేసి, మళ్లీ టీడీపీ నేతల కనుసన్నల్లో నడుస్తున్న మాఫియాకు వారు అడిగినన్ని బస్తాలు పంపితే ఇక లబ్ధిదారులకు ఏ విధంగా రేషన్ పంపిణీ చేయాలని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోదాముల నుంచి వచ్చే బస్తాల్లో తమ వాటాగా అధికారులు బస్తాకు పది కిలోలకుపైగా దోచుకుంటుంటే, మాఫియా కూడా తామేం తక్కువ కాదని బస్తాలకు బస్తాలు దోచుకుపోతున్నారు. మాఫియా సైతం కిలో రూ.16కు కొనుగోలు చేస్తోందని, ప్రజలకు ఇచ్చి మళ్లీ వారి వద్దే రూ.15 బియ్యం కొని మాఫియా అడిగినన్ని బస్తాలు ఇస్తున్నామని డీలర్లు వాపోతున్నారు.


