నాదెండ్ల: కుమార్తెను ఉన్నత చదువుల కోసం విదేశాలకు పంపాలన్న ఆ తండ్రి కల నెరవేరిన వేళ.. ఆ ఇంట సంతోషం అంబరాన్నంటింది. అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డ లండన్ వెళ్తుంటే, ఆ విమానం ఆకాశంలోకి ఎగిరే వరకు రెప్పవాల్చకుండా చూస్తూ కుటుంబసభ్యులు మురిసిపోయారు. కానీ, ఆ ఆనందం ఆవిరి కావడానికి ఎంతో సమయం పట్టలేదు. విధి ఆడిన వింత నాటకంలో వీడ్కోలు పలికి తిరిగి వస్తున్న తండ్రిని కొద్ది గంటల్లోనే మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో కబళించింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నాదెండ్ల మండలం ఎండుగుంపాలెం గ్రామానికి చెందిన ఎన్‌ఎస్‌పీ కెనాల్స్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ నెల్లూరి రామారావు(52) తన కుమార్తె అంజలిని ఎంఎస్ విద్యకోసం లండన్ పంపేందుకు కుటుంబసభ్యులతో కలిసి శుక్రవారం హైదరాబాద్ విమానాశ్రయానికి కారులో వెళ్లారు. శనివారం తెల్లవారుజామున 3 గంటలకు కుమార్తెను విమానం ఎక్కించి, వారు తిరుగు ప్రయాణమయ్యారు. మిర్యాలగూడ సమీపంలోని వేములపల్లి వద్దకు రాగానే వీరి కారు అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. పల్టీలు కొట్టిన కారు సమీపంలోని చెట్టును ఢీకొని ఆగింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా..కారు వెనుక సీటులో కూర్చున్న రామారావుకు అద్దాలు పగిలి తలకు బలంగా గుచ్చుకున్నాయి. తీవ్ర రక్తస్రావమై కొన ఊపిరితో ఉన్న రామారావును ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. కారు నడుపుతున్న కుమారుడు ఈశ్వరప్రసాద్, భార్య రామపూర్ణమ్మల కళ్లెదుటే ఈ ఘోరం జరగడంతో వారి రోదనలు మిన్నంటాయి. అదే కారులో రామారావు బావమరిది భార్య నాగలక్ష్మి, ఆమె ఐదేళ్ల కుమారుడు ఉన్నారు. అటు లండన్ వెళ్తున్న కుమార్తెకు తండ్రి మరణవార్త తెలియక, ఇటు చేతికందిన కొడుకు తండ్రిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో మునిగిపోయారు. నల్గొండలో పోస్టుమార్టం అనంతరం రామారావు భౌతికకాయం శనివారం సాయంత్రం గ్రామానికి చేరుకోవడంతో ఎండుగుంపాలెంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


