ఖాకీల వేధింపులకు దంపతుల ఆత్మహత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

ఖాకీల వేధింపులకు దంపతుల ఆత్మహత్యాయత్నం

May 9 2026 7:44 AM | Updated on May 9 2026 7:44 AM

ఖాకీల వేధింపులకు దంపతుల ఆత్మహత్యాయత్నం

మేం చనిపోతే మా కుమారుడిని

కాపాడండి

వీడియోలో డిప్యూటీ సీఎం

పవన్‌ కల్యాణ్‌కు మొర

కొల్లూరు : బాపట్ల జిల్లా కొల్లూరు గాంధీనగర్‌కు చెందిన నంబూరు కృష్ణ, రమణ దంపతులు శుక్రవారం కలుపు నివారణ మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రకాశం జిల్లా చీమకుర్తి ప్రాంతానికి చెందిన ఓ యువతి కొద్ది రోజుల కిందట కొల్లూరులోని తమ బంధువులైన ఈ దంపతుల ఇంటికి వచ్చింది. వారి కుమారుడైన జయరాజును వివాహం చేసుకుంటానని, తమకు పెళ్లి చేయాలని యువతి కోరడంతో ఆమె ఆధార్‌ కార్డు ప్రకారం మేజర్‌ అని నిర్ధారించుకుని వివాహం జరిపించారు. కొన్ని వారాల కిందట యువతి తల్లి వచ్చి ఆమె మైనర్‌ అని, బలవంతంగా వివాహం చేశారని పోలీసుకలు ఫిర్యాదు చేసింది. కొల్లూరు ఎస్‌ఐ కోటేశ్వరరావు సూచన మేరకు చీమకుర్తి పోలీసుస్టేషన్‌కు యువకుడి తరఫు వారు వెళ్లారు. యువకుడిపై పోక్సో, లైంగికదాడి, కిడ్నాప్‌ కేసులు నమోదైనట్లు తెలిసింది. తమ బిడ్డను గొడ్డును బాదినట్లు బాదడంతోపాటు, రోజుల తరబడి స్టేషన్‌ వద్ద తమను వేధిస్తూ మానసిక క్షోభకు గురి చేస్తున్నారంటూ ఆరోపించారు. ఈ వ్యవహారంలో పాత కక్షలను మనస్సులో పెట్టుకొని రేణుక, సురేష్‌, వంశీ, నవీన, శ్రీను అనే వ్యక్తులు బెదిరింపులకు పాల్పడుతూ కేసులు నమోదు చేయించారని ఆరోపించారు. పెద్ద మనిషిగా వచ్చిన వ్యక్తి బెదిరించడంతో తమను బతకనివ్వరనే ఆందోళనతోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నామని కన్నీటి పర్యంతమయ్యారు. తాము చనిపోయినా పోలీసుల వద్ద ఉన్న తమ కుమారుడిని కాపాడాలని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు మొరపెట్టుకున్నారు. దంపతులు పురుగుల మందు తాగి, వీడియో రూపంలో తమ బాధను వెళ్లగక్కడాన్ని గమనించిన స్థానికులు వారిని 108 వాహనంలో తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. దీనిపై ఎటువంటి సమాచారం అందలేదని కొల్లూరు ఎస్‌ఐ కోటేశ్వరరావు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement