ఆదాయపు పన్నుశాఖ అధికారులు
నరసరావుపేట: ప్రజలు ఆదాయపు పన్ను చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం సరళీకృతమైన విధానాలను తీసుకొచ్చిందని, వాటిని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ ఆదాయపు పన్ను సక్రమంగా సకాలంలో చెల్లించాలని ఆశాఖ అదనపు డైరెక్టర్ నెడుమారన్, డెప్యూటీ డైరెక్టర్(ఇన్వెస్టిగేషన్స్) భరత్ వెల్లడించారు. శుక్రవారం ఆదాయపు చట్టం–2025పె అవగాహన కార్యక్రమాన్ని చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షులు వనమా సాంబశివరావు అధ్యక్షతన సత్తెనపల్లిరోడ్డు కోట సెంటర్‌లోని వాసవీ కల్యాణ మండపంలో నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా హాజరైన అధికారులు మాట్లాడుతూ చట్టాన్ని సులభతరంగా ప్రజలకు చేరువ చేయటమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం 1961 చట్టంలో మార్పులు, చేర్పులు చేసిందన్నారు. 1961 చట్టంలో 819 సెక్షన్లు ఉంటే వాటిని 2025 చట్టంలో 533గాను, ఫారంలు 329 నుంచి 190కు కుదించారన్నారు. రేట్లు, టాక్స్, వడ్డింపులు తగ్గించారన్నారు. పలు దేశాల చట్టాలను పరిశీలించి మనదేశ ప్రజలు అందరికీ అర్దమయ్యేరీతిలో తీసుకొచ్చారన్నారు. 1961 చట్టం ప్రకారం అందజేసే బెనిఫిట్స్ 2025 చట్టంలోకూడా వర్తిస్తాయన్నారు. సామాన్య మానవులు సైతం సులభంగా సింగిల్ ఫారంలో పన్ను చెల్లించేలా ఏర్పాటు చేశారన్నారు. సీనియర్ ఆడిటర్ చేకూరి సాంబశివరావు, చాంభర్ కార్యదర్శి పచ్చిపులుసు సతీష్‌కుమార్, చాంభర్ ప్రతినిధులు తాళ్లూరి సత్యనారాయణ, బచ్చు నాగేశ్వరరావు, హనుమత్‌ప్రసాదు, కొప్పూరావూరి మోహనరావు, ఆడిటర్లు, వ్యాపారులు పాల్గొన్నారు.


