జ్యూస్ పాయింట్ నడిపేందుకు వీలు లేదని అభ్యంతరం ఖాళీ చేసేందుకు సమయం ఇవ్వాలని కోరినా పట్టించుకోని టీడీపీ నేతలు దుర్గారావుపై టీడీపీ మూకల దాడి
పిడుగురాళ్ల: వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా పిడుగురాళ్ల పట్టణ అధ్యక్షుడు తమ్మిశెట్టి దుర్గారావుపై గురువారం టీడీపీ మూకలు దాడి చేసి గాయపరిచారు. తమ్మిశెట్టి దుర్గారావు తెలిపిన వివరాల ప్రకారం... పట్టణంలోని గంగమ్మతల్లి దేవస్థానం ఎదురుగా గల ఓ టీ షాప్‌లో జ్యూస్ పాయింట్ నడుపుకునేందుకు టీ పాయింట్ యజమాన్ని అడగ్గా ఆయన అంగీకరించారు. దీంతో దుర్గారావు జ్యూస్ పాయింట్ పెట్టుకుని నడుపుకుంటున్నాడు. టీడీపీకి చెందిన షేక్ ఇంతియాజ్ టీ షాపు యజమానికి ఫోన్ చేసి వైఎస్సార్‌సీపీ సోషల్‌మీడియా యాక్టివిస్ట్‌కు ఎందుకు జ్యూస్ పాయింట్‌కు అనుమతి ఇచ్చారని ప్రశ్నించాడు. ఖాళీ చేయించాల్సిందేనని హుకుం జారీ చేశాడు. టీ షాపు యజమాని దుర్గారావుకు విషయం చెప్పగా ఖాళీ చేసేందుకు కొంత సమయం కోరాడు. రాత్రి సమయంలో అందరు నడిరోడ్డుపై ఉండగానే నలుగురు టీడీపీ కార్యకర్తలు దుర్గా జ్యూస్ పాయింట్ వద్దకు వచ్చి కర్రలతో దాడి చేశారు. దుర్గారావు తప్పించుకొని వైఎస్సార్ సీపీ కార్యాలయానికి చేరుకున్నాడు. సంఘటన తెలుసుకున్న వైఎస్సార్ సీపీ స్టేట్ బీసీ సెల్ జాయింట్ సెక్రటరీ శెట్టుపల్లి పూర్ణ దుర్గారావును నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తీసుకొని వెళ్లి చికిత్స చేయించారు.
దుర్గారావుకు కాసు మహేష్ పరామర్శ
నరసరావుపేట: సోషల్ మీడియా కన్వీనర్ తమ్మిశెట్టి దుర్గారావుపై దాడిచేసిన టీడీపీ గుండాలపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని గురజాల మాజీ శాసనసభ్యులు కాసు మహేష్‌రెడ్డి డిమాండ్ చేశారు. దాడిలో గాయపడి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న పిడుగురాళ్ల సోషల్ మీడియా కన్వీనర్ తమ్మిశెట్టి దుర్గారావును గురువారం ఆయన పరామర్శించారు. సంఘటన జరిగిన విధానం అడిగి తెలుసుకున్నారు. పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. మహేష్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. పిడుగురాళ్ల నడిరోడ్డులో బుధవారం రాత్రి టీడీపీకి చెందిన నలుగురైదుగురు గుండాలు దుర్గారావుపై దాడిచేసి విచక్షణ రహితంగా కొట్టారన్నారు. కేవలం సోషల్ మీడియాలో పార్టీ అధ్యక్షులు వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డికి అనుకూలంగా పోస్టులు పెడుతున్నాడనే కారణంతో టీడీపీ నాయకులు కొంతకాలంగా దుర్గారావును వేధిస్తున్నారన్నారు. నియోజకవర్గంలో పలు గ్రామాలు, ప్రాంతాల్లో జరిగిన సంఘటనపై ఛలో గురజాల నిర్వహిస్తామన్నారు. ప్రజా ఉద్యమాన్ని నిర్వహిస్తామని ప్రకటించారు. పలువురు వడ్డెర సంఘ నాయకులు కూడా దుర్గారావును పరామర్శించారు.


