పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు | - | Sakshi
Sakshi News home page

పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు

May 8 2026 11:14 AM | Updated on May 8 2026 11:14 AM

కలెక్టరేట్‌లో ఘనంగా నివాళులర్పించిన అధికారులు

నరసరావుపేట: గిరిజనులను అన్ని రకాలుగా చైతన్యపరచి బ్రిటీష్‌ ప్రభుత్వంపై పోరాడిన మహోన్నత నాయకుడు అల్లూరి సీతారామరాజు అని డీఆర్‌ఓ నారదముని కొనియాడారు. కలెక్టరేట్‌లో గురువారం అల్లూరి వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ భారత స్వాతంత్య్ర పోరాటంలో ప్రముఖ విప్లవకారుడని, ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా మోగల్లు గ్రామంలో జన్మించారని తెలిపారు. సీతారామరాజు తన ప్రాథమిక విద్యను పశ్చిమ గోదావరి జిల్లాలోని వివిధ గ్రామాల్లో అభ్యసించారని, 15 ఏళ్ల వయస్సులో విశాఖపట్నంలో ఉన్న హైస్కూల్‌, విశ్వవిద్యాలయంలో విద్యను కొనసాగించారని చెప్పారు. 18 ఏళ్ల వయస్సులో సన్యాసిగా మారి జ్యోతిష్యం, ఆయుర్వేదం వంటి విషయాల్లో ప్రావీణ్యం సాధించారని, ఆయన ఆధ్యాత్మికత, త్యాగనిరతి గిరిజనుల్లో విశేషమైన ప్రభావాన్ని చూపిందని వివరించారు. సీతారామరాజు నాయకత్వంలో జరిగిన రంపా తిరుగుబాటు బ్రిటిష్‌ పాలనకు గట్టి ఎదురుదెబ్బ ఇచ్చిందని తెలిపారు. విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల గిరిజనులను సమీకరించి బ్రిటిష్‌ ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారని, ఆయన నాయకత్వంలో గిరిజనులు పోలీస్‌స్టేషన్లపై దాడులు చేసి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారని పేర్కొన్నారు. ఈ పోరాటం బ్రిటిష్‌ ప్రభుత్వాన్ని తీవ్రంగా కలవరపరిచిందని తెలిపారు. 1924 మే 7న సీతారామరాజు బ్రిటిష్‌ సైన్యం చేతిలో పట్టుబడి అనంతరం కాల్చి చంపబడ్డారని చెప్పారు. భారత స్వాతంత్య్ర ఉద్యమంలో ఆయన కృషి ఎనలేనిదని కొనియాడారు. జిల్లా గిరిజన సంక్షేమ అధికారి గోవింద్‌ నాయక్‌, జిల్లా గణాంక అధికారి యూవీ సత్యనారాయణరాజు, టూరిజం అధికారి నాయుడమ్మ, కోఆర్డినేషన్‌ సూపరింటెండెంట్‌ నాగిరెడ్డి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement