యడ్లపాడు: మండలంలోని మర్రిపాలెం రెవెన్యూ గ్రామంలో గురువారం తొలిగా నిర్వహించిన వన్ మంత్–వన్ మండల్– వన్ విలేజ్ 4 విజిట్స్ కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ సంజనా సింహ సందర్శించారు. అధికారులను, ప్రజల్ని కలసి తెలుసుకున్నారు. జేసీ మాట్లాడుతూ మండలం మర్రిపాలెం గ్రామంలో వరుసగా నాలుగు గురువారాలు గ్రామసభలు రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ గ్రామసభల్లో ఇచ్చిన ప్రతి అర్జీ ప్రజాసమస్యల పరిష్కార వేదిక యాప్‌లో నమోదవుతుందన్నారు. ప్రతి అర్జీపై మండలస్థాయి నుంచి ఉన్నతస్థాయి అధికారుల పరిశీలన ఉంటుందని, కావున ప్రజలు ఈ కార్యక్రమంలో సుదీర్ఘంగా ఉన్న తమ సమస్యల్ని పరిష్కరించుకోవాలని కోరారు. మండలంలోని మర్రిపాలెం గ్రామంలో నిర్వహించిన తొలి గ్రామసభలో స్థానికుల నుంచి ఐదు అర్జీలు అందినట్లు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ జెట్టి విజయశ్రీ, ఎంపీడివో వి హేమలతాదేవి, ఎంఈవో ఎంవీ నాగరత్నం, ఆర్‌ఐ సుబ్బారావు, సర్వేయర్ గేరా సురేంద్రనాథ్, దేవదాయ, అటవీ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.


