ముగిసిన ఎడ్ల బండ లాగుడు పోటీలు
నందిగామ రూరల్: మండలంలోని లింగాలపాడు గ్రామంలో ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయిలో నిర్వహిస్తున్న ఎడ్ల బండ లాగుడు పోటీలు విజయవంతంగా ముగిశాయి.. బుధవారం రాత్రి జరిగిన ఒంగోలు జాతి సీనియర్ విభాగం ఎడ్ల బండ లాగుడు పోటీలలో విజేతల ఎడ్ల జత యజమానులకు రైతు కమిటీ సభ్యులు బహుమతులు అందజేశారు. బుధవారం రాత్రి సీనియర్ విభాగంలో నిర్వహించిన ఒంగోలు జాతి ఎడ్ల బండ లాగుడు పోటీలలో పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం పురుషోత్తమపట్నం గ్రామానికి చెందిన షేక్ అబ్దుల్ సత్తార్ ఎడ్ల జత 3,030 అడుగుల దూరం లాగి ప్రథమ స్థానంలో నిలిచాయి. గుంటూరు జిల్లా రెడ్డిపాలేనికి చెందిన కాఠసాని హేమచంద్రారెడ్డి, జాన్వికారెడ్డి, కాకుమాను మండలం కొండబాలవారిపాలెంకు చెందిన గూడవల్లి లక్ష్మీదీక్షిత చౌదరి ఎడ్ల జత 3000 అడుగుల దూరం లాగి ద్వితీయ స్థానంలో నిలిచిందన్నారు. గుంటూరు జిల్లా రెడ్డిపాలేనికి చెందిన కాఠసాని హేమచంద్రారెడ్డి, జాన్వికారెడ్డి, కాకుమాను మండలం కొండబాలవారిపాలెంకు చెందిన గూడవల్లి లక్ష్మీదీక్షిత చౌదరి ఎడ్ల జత 2,778 అడుగుల దూరం లాగి తృతీయ స్థానం, మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం మండలం వీరాయపాలెంకు చెందిన దూదేకుల పెద్ద చాంద్‌బాషా ఎడ్ల జత 2,585 అడుగుల దూరం లాగి నాలుగవ స్థానంలో నిలిచినట్లు రైతు కమిటీ సభ్యులు తెలిపారు. విజేతల ఎడ్ల జత యజమానులకు వరుసగా రూ.లక్ష, 80 వేలు, 70 వేలు, 60 వేల నగదు బహుమతులతోపాటు, జ్ఞాపికలను ఆలయ వంశపారంపర్య ధర్మకర్త చిరుమామిళ్ల లక్ష్మీ సాయిబాబు, రైతు కమిటీ సభ్యులు అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతు కమిటీ సభ్యులతోపాటు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.


