అత్త ఇంట్లో దొంగతనం చేసిన అల్లుడు | - | Sakshi
Sakshi News home page

అత్త ఇంట్లో దొంగతనం చేసిన అల్లుడు

May 8 2026 11:14 AM | Updated on May 8 2026 11:14 AM

చేబ్రోలు: భార్య పుట్టింటికి వెళ్లి నాలుగు నెలలు గడిచినా తిరిగిరాకపోవటం, దురవ్యసనాలకు అలవాటు పడిన అల్లుడు అత్త ఇంట్లో చోరీకి పాల్పడి పోలీసులకు చిక్కి కటకటాల పాలైన సంఘటన చేబ్రోలు మండలం వేజండ్ల గ్రామంలో జరిగింది. చేబ్రోలు పోలీసుస్టేషన్‌లో పొన్నూ రు రూరల్‌ సీఐ పి కృష్ణయ్య, స్థానిక ఎస్‌ఐ పి వీరనారాయణ గురువారం వివరాలు వెల్లడించారు. చేబ్రోలు మండలం గుండవరం గ్రామానికి చెందిన సాతర్ల గోపికి వేజండ్ల గ్రామానికి చెందిన తిరుపతమ్మతో 2010లో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు. కొంత కాలంగా బార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చాయి. మద్యానికి అలవాటు పడిన గోపి భార్య మీద అనుమానంతో వేధింపులకు గురిచేస్తున్నాడు. బాధలు భరించలేక నాలుగు నెలల కింద తిరుపతమ్మ వేజండ్లలోని పుట్టింటికి వెళ్లిపోయింది. పేకాట, మద్యానికి డబ్బులు అవసరమై, ఆర్థిక ఇబ్బందులు పడుతున్న గోపి వేజండ్లలోని భార్య ఇంటికి వెళ్లాడు. ఐదు రోజుల కిందట భార్య తిరుపతమ్మతోపాటు వారి అత్త కలిసి ధూళిపాళ్లలోని బంధువుల ఇంటిలో జరిగే శుభకార్యానికి వెళ్లారు. 4వ తేదీన వేజండ్లలోని అత్త ఇంటికి వచ్చిన అల్లుడు గోపి ఇంటిలో ఎవరూ లేకపోవటంతో తలుపులు పగలకొట్టి లోపలికి ప్రవేశించి బీరువా తాళాలు పగలకొట్టి అందు లోని బంగారు, వెండి వస్తువులను అపహరించుకొని పారిపోయాడు. సుమారు రూ.9 లక్షల విలువ చేసే బంగారు హారం, నెక్లెస్‌, చైన్‌లతో పాటు ఒక జత వెండి కాళ్ల పట్టీలను తీసుకువెళ్లిపోయాడు. ఇంటికి వచ్చి గమనించిన తిరుపతమ్మ చేబ్రోలు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఎస్‌ఐ పి వీరనారాయణ కేసు దర్యాప్తు చేశారు. కొత్తరెడ్డిపాలెం అడ్డరోడ్డు వద్ద నిందితుడు సాతర్ల గోపిని పోలీసులు అరెస్ట్‌ చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు వివరించారు. ఎస్‌ఐ పి వీరనారాయణ, సిబ్బందిని ఎస్పీ వకుల్‌ జిందాల్‌, తెనాలి డీఎస్పీలు అభినందించారు.

తొమ్మిది లక్షల బంగారు, వెండి నగలు

అపహరణ

Advertisement
 
Advertisement
Advertisement