గుంటూరు వెస్ట్ (క్రీడలు): విజయనగరంలోని రాజీవ్ స్టేడియంలో ఈనెల 5, 6, 7 తేదీల్లో జరిగిన 5వ రాష్ట్రస్థాయి టైక్వాండో చాంపియన్‌షిప్ పోటీలకు కాశీనాథ్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ నుంచి శిక్షణ పొందిన 26 మంది క్రీడాకారులు హాజరయ్యారని అకాడమీ నిర్వాహకుడు కాశీనాఽథ్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. న్యూ ఆంధ్రప్రదేశ్ టైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన పోటీలకు అకాడమీ క్రీడాకారులకు మూడు బంగారు, ఐదు రజతాలు, 14 మంది కాంస్య పతకాలతో సహా మొత్తం 22 పతకాలు కై వసం చేసుకున్నారన్నారు. తమ అకాడమీ ద్వారా ఇప్పటికే ఎంతోమంది జాతీయస్థాయి పోటీలకు హాజరై ఎన్నో మెడల్స్ సాధించారన్నారు. రానున్న రోజుల్లోనూ జాతీయస్థాయి పోటీలకు కూడా ఇదే స్థాయిలో ఎక్కువమంది ఎంపికయ్యేలా శిక్షణ ఇస్తామన్నారు.
ఆస్తి వివాదంపై ఘర్షణ
దాచేపల్లి: ఆస్తి వివాదం నేపథ్యంలో సచివాలయంలోనే ఘర్షణ పడ్డారు. మండలంలోని గామాలపాడు గ్రామ సచివాలయంలో అధికారుల ఎదురుగానే ఇరువర్గాలు పరస్పర దాడులకు దిగారు. గురువారం జరిగిన ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సేకరించిన వివరాలు ఇలా ఉన్నాయి. గామాలపాడులో ఉన్న ఆస్తిపై ఇరువర్గాల మధ్య కొంత కాలంగా వివాదం నడుస్తోంది. ఈ వివాదంపై వివరాలు తెలుసుకునేందుకు సచివాలయం అధికారులు ఇరువర్గాలను సచివాలయానికి పిలిపించారు. ఇరు వర్గాలకు సంబంధించిన డాక్యుమెంట్లు పరిశీలన చేస్తున్న క్రమంలో ఇరువర్గాల మధ్య మాటా మాటా పెరిగింది. ఈ నేపథ్యంలో ఇరువర్గాలు అధికారులు ఎదుటే పరస్పరం దాడులకు దిగారు. గ్రామ సచివాలయంలో ఇరువర్గాలు దాడులకు దిగిన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాలో నమోదయ్యాయి. దాడుల్లో స్థానిక టీడీపీ నాయకులు కూడా పాల్గొన్నట్టు ఆ దృశ్యాల్లో కనిపిస్తున్నాయి. దాడుల్లో పలువురికి గాయాలయ్యాయి. గ్రామ సచివాలయంలో జరిగిన ఘటనపై బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టారు.


