గుంటూరు ఎడ్యుకేషన్ భావితరాలకు భారతీయ రంగస్థల కళా వైభవాన్ని తెలియజేసే విధంగా ‘భవన్స్ అకాడమీ ఆఫ్ కల్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్‘ ఆధ్వర్యంలో ఈనెల 15 నుంచి 18వ తేదీ వరకు ప్రత్యేక రంగస్థల నాటనాభినయ శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు భారతీయ విద్యాభవన్ కార్యదర్శి పి.రామచంద్రరాజు తెలిపారు. గురువారం కలెక్టర్ బంగ్లారోడ్డులోని భారతీయ విద్యాభవన్‌లో వర్క్‌షాప్ ఆన్ థియేటర్ ఆర్ట్ పోస్టర్లు ఆవిష్కరించారు. రామచంద్రరాజు మాట్లాడుతూ గుంటూరు నగర యువత, విద్యార్థులతోపాటు ఔత్సాహికులకు రంగస్థల నటన, ముఖాభినయం, గాత్ర, ధ్వని అనుకరణ కళ, నాటక సృజనాత్మకత, నైపుణ్యతపై లబ్ద ప్రతిష్టులైన రంగస్థల నిపుణులు, నంది పురస్కార గ్రహీతలతో శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు. వయస్సుతో నిమిత్తం లేకుండా ఆయా కళల్లో శిక్షణ పొందదలచిన అభ్యర్థులు రోజుకు మూడు గంటలు చొప్పున నాలుగు రోజులపాటు నిర్వహించే శిక్షణ శిబిరంలో శిబిరంలో పాల్గొనేందుకు 0863–2234802, 9124519444 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రముఖ రంగస్థల నటుడు డాక్టర్ ఎన్.రవికుమార్, రంగస్థల నటుడు, రచయిత కందిమళ్ల సాంబశివరావు, హిందూ కళాశాల పూర్వ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ దుర్గాప్రసాద్, పూర్వ తెలుగు విభాగాధిపతి డాక్టర్ వై.మల్లికార్జునరావు, రవిశంకర్, సీరియల్ నటులు ముత్తవరపు పద్మారావు, మల్లెల శ్రీనివాసరావు పాల్గొన్నారు.


