అచ్చంపేట: మార్చిలో జరిగిన 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన ఇరువురు విద్యార్థులను బ్లూబెల్స్ పాఠశాల యాజమాన్యం బుధవారం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ తీసుకెళ్లారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్‌ఎం మేరీ శ్రీలత మాట్లాతూ 595మార్కులు సాధించిన పెద్దింటి సైదేశ్వరరావు, 593 మార్కులు సాధించిన మద్దుల శ్రీలక్ష్మిలను ప్రోత్సహించేందుకు, మిగిలిన విద్యార్థులకు ప్రేరణ కల్పించడంలో భాగంలోనే విమాన ట్రిప్పు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి యేటా తమ పాఠశాల విద్యార్థులు నూరుశాతం విత్తీర్ణత సాధిస్తున్నారన్నారు.
కారెంపూడి: బైక్ వరిగడ్డి ట్రాక్టర్ ట్రక్కును ఢీకొన్న ఘటనలో అక్కడికక్కడే వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని వేపకంపల్లి గ్రామ రోడ్డు సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. కారెంపూడికి చెందిన నెమలికంటి రామాంజనేయులు తెలంగాణ రాష్ట్రం వాడపల్లి నుంచి బైక్‌పై స్వగ్రామం కారెంపూడి వస్తున్నారు. దాచేపల్లి రోడ్డులోని ఆంజనేయస్వామి గుడి సమీప ప్రాంతంలో ఆగి ఉన్న వరిగడ్డి ట్రాక్టర్ ట్రక్కును ఢీకొన్నారు. దీంతో బైక్‌పై ఉన్న రామాంజనేయులు (42) తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రామాంజనేయులుకు భార్య ఇద్దరు పిల్లలున్నారు. ఈ ఘటనతో కారెంపూడి గ్రామంలో విషాదం అలుముకుంది. మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మృతుని కుటుంబానికి రూ.25 వేల ఆర్థిక సాయం అందించారు.
చేబ్రోలు: మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీకి జాతీయ స్థాయి పేటెంట్ లభించినట్లు ఇన్‌చార్జి వైస్ చాన్స్‌లర్ కేవీ క్రిష్ణకిశోర్ బుధవారం తెలిపారు. వీసీ మాట్లాడుతూ విజ్ఞాన్ బయోటెక్నాలజీ విభాగానికి చెందిన పరిశోధన విద్యార్థి అంపసాని చెన్నయ్య, డాక్టర్ కె. చంద్రశేఖర్ సంయుక్తంగా ప్రతిపాదించిన పరిశోధనకు ఈ పేటెంట్ మంజూరైనట్లు వెల్లడించారు. ‘పోర్టబుల్ సాయిల్ ఫెస్టిసైడ్ మానిటరింగ్ అండ్ అనాలిసిస్ కిట్’ అనే అంశంపై చేసిన పరిశోధనకు ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండియా అథారిటీ సంస్థ పేటెంట్‌ను మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ పేటెంట్‌కు 20 సంవత్సరాలపాటు హక్కులు ఉంటాయని వివరించారు. ఈ కిట్ వ్యవసాయ భూముల్లో పురుగు మందుల అవశేషాలను తక్షణమే గుర్తించి విశ్లేషించడానికి ఉపయోగపడుతుందని, రైతులకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారే అవకాశం ఉందని వివరించారు. బయోటెక్ విభాగానికి చెందిన డాక్టర్ కే చంద్రశేఖర్(హెచ్–ఇండెక్స్–43), ఫార్మసీ విభాగానికి చెందిన డాక్టర్ మిథున్ రుద్రపాల్(హెచ్–ఇండెక్స్–36) స్కోపస్‌లో అత్యుత్తమ హెచ్–ఇండెక్స్‌ను సాధించినట్లు చెప్పారు.


