నరసరావుపేట రూరల్: విద్యార్థుల భద్రత కోసం స్కూల్ బస్సులను నిబంధనలకు అనుగుణంగా సిద్ధం చేయాలని జిల్లా రవాణా శాఖ అధికారి జి.సంజీవకుమార్ తెలిపారు. జిల్లాలోని బడి బస్సులపై ప్రత్యేక తనిఖీల కోసం నాలుగు బృందాలను ఏర్పాటు చేసినట్టు వివరించారు. జిల్లాలోని నాలుగు కార్యాలయాల పరిధిలో 162 ప్రైవేటు పాఠశాలలకు సంబంధించి 770 బస్సులు ఉన్నట్టు వివరించారు. బస్సులను బృందాలు తనిఖీ చేసి నిబంధనల ప్రకారం ఎటువంటి మరమ్మతులు చేపట్టాల్సి ఉందో వివరిస్తారు. ప్రతి బస్సుకు ఏఐఎస్–140 ప్రకారం వీఎల్‌టీడీ, పానిక్ బటన్ అమర్చాలని స్పష్టం చేశారు. ఇప్పటివరకు తనిఖీ బృందాలు 119 బస్సులకు నోటీసులు జారీ చేసినట్టు తెలిపారు.
31 వరకు గడువు
మోటార్ వెహికల్స్ చట్టం ప్రకారం భద్రతా నిబంధనలకు అనుగుణంగా ఈ నెల 31వ తేదీలోగా బస్సులను సిద్ధం చేయాలని పాఠశాల యాజమాన్యాలకు ఆర్‌టీవో సూచించారు. ఫిట్‌నెస్ సర్టిఫికెట్, భద్రతా పరికరాల ఏర్పాటు, సరైన పత్రాలు, ఇతర నిబంధనలు తప్పనిసరని స్పష్టం చేశారు. రవాణా శాఖ ఆధ్వర్యంలో తరచూ ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. స్కూల్ బస్సులకు సంబంధించిన అత్యవసర ద్వారం, స్పీడ్ గవర్నర్, ఫైర్ డిస్టెన్షన్ అలారం, హ్యాండ్ బ్రేక్, సిగ్నల్ లైట్స్, డిటెన్షన్ అగ్నిమాపక యంత్రాలు, అత్యవసరద్వారం పనితీరును పరిశీలిస్తారని వివరించారు. అత్యవసర ద్వారంకు ఎటువంటి ప్రతిబంధకం లేకుండా సీట్లను అమర్చాలని సూచించారు.
కచ్చితంగా అమలు చేయాలి
పాఠశాల బస్సులలో నిబంధనలు అమలు అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. నిర్దేశిత గడువు తరువాత ఏవైనా ఉల్లంఘనలు గమనిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థుల భద్రతను ప్రాధాన్యంగా తీసుకుని అన్ని స్కూల్ యాజమన్యాలు రవాణా శాఖతో సహకరించాలని కోరారు.


