చిలకలూరిపేటటౌన్: మండలం పరిధిలోని గోపాలంవారిపాలెం గ్రామంలో జిల్లా కలెక్టర్ కృతికాశుక్ల మంగళవారం పర్యటించారు. ముందుగా గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించి బడిబాట కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్షరాలా ఒక ఉపాధ్యాయురాలిగా మారిపోయారు. పాఠశాల ప్రాంగణంలో చిన్నారులతో ఆప్యాయంగా ముచ్చటిస్తూ, వారి చదువుల పురోగతిని అడిగి తెలుసుకున్న కలెక్టర్.. ప్రభుత్వ బడుల్లో అందుతున్న కార్పొరేట్ స్థాయి వసతులను వినియోగించుకోవాలని తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. అక్షర వెలుగులతో గ్రామం మెరవాలని ఆకాంక్షించారు. అనంతరం సమీపంలోని టెక్స్‌టైల్ పార్కును సందర్శించారు. అక్కడ పారిశ్రామిక అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనపై క్షేత్రస్థాయిలో సమీక్ష నిర్వహించి, జిల్లా ప్రగతిలో వస్త్ర పరిశ్రమ పాత్రను ప్రత్యేకంగా ప్రస్తావించారు. తహసీల్దార్ మొహమ్మద్ హుస్సేన్, టెక్ట్స్‌టైల్స్ ప్రతినిధులు సామినేని కోటేశ్వరరావు, పలువురు పారిశ్రామిక వేత్తలు ఉన్నారు.


