వినుకొండ: దరువు సాంస్కృతిక ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 9,10 తేదీల్లో పట్టణంలోని ఎన్‌ఎస్‌పీ కాలనీ గ్రౌండ్స్‌లో జాతీయస్థాయి డప్పు పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పోటీల వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ పోటీల్లో పద్మశ్రీ అవార్డు గ్రహీత, కర్ణాటక వాసి నండోజ పిండి పాపన్ హళ్లి ముని వెంకటప్ప మాదిగకు సన్మానం జరుగుతుందన్నారు. పోటీలకు ఆరు రాష్ట్రాల నుంచి ఎంపికై న నిష్ణాతులైన 12 టీమ్‌లు పాల్గొంటాయని, విజేతలైన టీమ్‌లకు మొదటి బహుమతి రూ.లక్ష, రెండో బహుమతి రూ.50వేలు, మూడో బహుమతి రూ.30వేలు నగదు, పాల్గొన్న టీమ్‌లకు రూ.10వేలు నగదు, ప్రశంసాపత్రం, సన్మానం ఉంటుందన్నారు. కార్యక్రమాన్ని దరువు వ్యవస్థాపకులు ఎర్రగుంట్ల భాస్కర్‌రావ్, కన్వీనర్ ప్రసాద్, కో–కన్వీనర్ స్కైలాబ్ కిరణ్, కో–ఆర్డినేటర్ బేతం గాబ్రియేల్, మోజేస్, సలహాదారులు చాట్ల రామయ్య, ఆర్గనైజర్స్ బంక ఎలియాజర్, కూచిపూడి వినోద్‌కుమార్ తదితరులు పర్యవేక్షిస్తారని తెలిపారు.
రెంటచింతల: మండలంలోని గోలి గ్రామానికి చెందిన వడితే చంద్రూ నాయక్(38) మిట్టగుడిపాడు–గోలి గ్రామాల మార్గ మధ్యలోని ఓ కల్వర్టు వద్ద మృతి చెందినట్లు మంగళవారం ఓ వ్యక్తి గుర్తించి పోలీసులకు సమాచారం తెలిపారు. ఏప్రిల్ 30న గురువారం అదే గ్రామానికి చెందిన గురవయ్యకు ఆ ప్రాంతంలోని పొలం గట్టున చంద్రూ నాయక్ కన్పించాడు. అప్పటి నుంచి మంగళవారం వరకు చంద్రూ నాయక్ జాడలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఎండ తీవ్రతకు మంచినీరు లేక దప్పికతో మృతి చెందినట్లు పోలీసులు, మృతుని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఎస్‌ఐ సీహెచ్ నాగార్జున కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
నగరంపాలెం: భద్రత దృష్ట్యా హెల్మెట్ల వినియోగం చోదకులకు చాలా అవసరమని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. ఆప్‌కా సాబ్‌కి అవాజ్ సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని హాల్‌లో హోంగార్డులకు హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ ప్రజా భద్రత కోసం నిరంతరం విధులు నిర్వర్తించే హోంగార్డులకు హెల్మెట్లను విరాళంగా పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. సంస్థ అందిస్తున్న సేవా కార్యక్రమాలు ఇతర సంస్థలకు ప్రేరణగా నిలుస్తాయని పేర్కొన్నారు. సమాజ సేవ చేయడం సంస్థ ప్రధాన ఉద్దేశమని సంస్థ నిర్వాహకులు తెలిపారు. భవిష్యత్‌లో మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో వెల్ఫేర్ ఆర్‌ఐ సురేష్, సంస్థ సభ్యులు శివ కుమార్, డాక్టర్ రాధమాధవి, కిరణ్ పాల్గొన్నారు.


