నరసరావుపేట: డీలిమిటేషన్ ప్రక్రియతో సంబంధం లేకుండా మహిళా రిజర్వేషన్ బిల్లును తక్షణమే అమలు చేయాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.సావిత్రి డిమాండ్ చేశారు. స్థానిక కోటప్పకొండ రోడ్డులోని పల్నాడు విజ్ఞాన కేంద్రంలో మంగళవారం ఐద్వా పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి గుంటుపల్లి రజిని అధ్యక్షతన నిర్వహించిన డీలిమిటేషన్–మహిళా రిజర్వేషన్ బిల్లుపై అవగాహన సదస్సులో సావిత్రి మాట్లాడారు. డిలిమిటేషన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం బిల్లును అమలు చేయడంలో ఆలస్యం చేస్తుందన్నారు. ఇప్పటికే పార్లమెంట్ ఆమోదం పొందిన ఈ బిల్లును అమలు చేయడం కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతని స్పష్టం చేశారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించే చట్టం అమలు విషయంలో ఆలస్యం జరుగుతుందని డీలిమిటేషన్‌తో అనుసంధానం చేయడం సరికాదన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న చర్యలు రాజకీయ ప్రయోజనాల కోసమేనని విమర్శించారు. మహిళా రిజర్వేషన్ అమలుకు మద్దతుగా ఈ నెల 7న విజయవాడలో 2కె రన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. సీపీఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయకుమార్ మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన మద్యం అందిస్తామని చెప్పే కూటమి ప్రభుత్వ పెద్దలు, అదేస్థాయిలో నాణ్యమైన విద్య, వైద్యం, ఆహారం జీవన ప్రమాణాల గురించి ఎందుకు ప్రస్తావించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో రాజకీయ నాయకుల మద్దతు లేకుండా గంజాయి సాగు జరగడం అది బహిరంగ మార్కెట్‌లో అందుబాటులో ఉండటం సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వై. రాధాకృష్ణ, శ్రామిక మహిళా సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ డి.శివకుమారి, సీఐటీయు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షురాలు జి.మల్లేశ్వరి, మహిళా సంఘం సీనియర్ నాయకురాలు జి.ఉమశ్రీ, జిల్లా అధ్యక్షురాలు జె.అనూషలు పలు అంశాలపై మాట్లాడారు. వివిధ మహిళా సంఘాలు ప్రజా సంఘాలు అధిక సంఖ్యలోమహిళలు పాల్గొన్నారు.
ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సావిత్రి


