చర్చి స్థలాల్లో అక్రమ నిర్మాణాలు | - | Sakshi
Sakshi News home page

చర్చి స్థలాల్లో అక్రమ నిర్మాణాలు

May 6 2026 8:07 AM | Updated on May 6 2026 8:07 AM

చర్చి స్థలాల్లో అక్రమ నిర్మాణాలు విద్యార్థులకు పుస్తక పఠనంపై అవగాహన

మున్సిపల్‌ కమిషనర్‌ తీరుపై చర్చి సభ్యుల ఆగ్రహం జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు

వినుకొండ: పురపాలక సంఘం పరిధిలో గల క్రైస్తవ మిషనరీ ఆస్తులు ఆక్రమణల పర్వానికి గురవుతున్నాయి. నకిలీ పత్రాలు సృష్టించి కొందరు వ్యక్తులు చర్చి స్థలాలను ఆక్రమించడమే కాకుండా హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులను సైతం ఖాతరు చేయకుండా నిర్మాణాలు కొనసాగిస్తుండటంపై చర్చి కోశాధికారి పులిమల సునీల్‌కుమార్‌తో పాటు సంఘ సభ్యులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఇమ్మానుయేలు తెలుగు బాప్టిస్ట్‌ చర్చికి సంబంధించిన విలువైన స్థలాలను కొందరు ఆక్రమణదారులు తప్పుడు ధ్రువపత్రాలతో పురపాలక సంఘం నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా అన్నపూర్ణ హోటల్‌ ఎదురుగా అక్రమంగా భవన నిర్మాణాలు చేపడుతున్నా బాధ్యత ఉన్న మున్సిపల్‌ అధికారులు, ఆక్రమణదారులతో చేతులు కలిపారని చర్చి సభ్యులు ఆరోపిస్తున్నారు. కోర్టు ఆర్డర్‌ కాపీని చూపించినా కమిషనర్‌ స్పందించకపోగా నేను ఏ చర్యలు తీసుకోను, మీకు చేతనైనది చేసుకోండి అంటూ బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయస్థానం ఆదేశాలను తుంగలో తొక్కి అక్రమ నిర్మాణాలకు సహకరిస్తున్న మున్సిపల్‌ కమిషనర్‌పై కఠినచర్యలు తీసుకోవాలని, తక్షణమే జిల్లా యంత్రాంగం స్పందించి మిషనరీ ఆస్తులను కాపాడాలని, కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు.

గుంటూరు ఎడ్యుకేషన్‌: విద్యార్థులకు పుస్తక పఠనంపై అవగాహన పెంచుకోవాలని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి వంకదారి సుబ్బరత్నమ్మ తెలిపారు. మంగళవారం పట్టాభిపురంలోని శాఖ గ్రంథాలయంలో శిక్షణ శిబిరాన్ని పరిశీలించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు గ్రంథాలయ ప్రాముఖ్యత తెలుసుకోవాలని సూచించారు. పుస్తక పఠనంతో మేధస్సు అభివృద్ధి చెందడంతో పాటు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. గ్రంథాలయంలోని పుస్తకాలను చదవడం వలన మంచి అలవాట్లు చేకూరుతాయన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్‌ పడాల సుబ్బారెడ్డి, ఎన్జీవో పార్కు అసోసియేషన్‌ అధ్యక్షురాలు జె.సుబ్బాయమ్మ, గ్రంథాలయాధికారి పి.సత్య శిరీష పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement