అభివృద్ధి చేయలేదని జీవీనే ఒప్పుకున్నారు.. | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి చేయలేదని జీవీనే ఒప్పుకున్నారు..

Feb 23 2026 7:36 AM | Updated on Feb 23 2026 7:36 AM

అభివృద్ధి చేయలేదని జీవీనే ఒప్పుకున్నారు..

అభివృద్ధి చేయలేదని జీవీనే ఒప్పుకున్నారు..

అభివృద్ధి చేయలేదని జీవీనే ఒప్పుకున్నారు..

వినుకొండ: ప్రజలు మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నప్పటికీ ఎలాంటి అభివృద్ధి చేయలేకపోయానని జీవీ ఆంజనేయులు స్వయంగా ఒప్పుకున్నారని వైఎస్సార్‌ సీపీ పీఏసీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. వినుకొండలో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో బొల్లా మాట్లాడుతూ 2020లో తమ ప్రభుత్వం కోట్లాది రూపాయల విలువైన ఎన్‌ఎస్పీ భూములను మునిసిపాలిటీకి అప్పగిస్తూ తెచ్చిన జీవోలను ఆయన మీడియాకు చూపారు. మున్సిపాలిటీ స్థలాన్ని షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణాలకు, వంద పడకల ఆసుపత్రి భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించింది మేము కాదా అని ప్రశ్నించారు. మేము అనుమతులు తీసుకొస్తే, చంద్రబాబు అనుమతులు ఇచ్చారని, మేమే అనుమతులు తీసుకొచ్చామని చెబుతూ చంద్రబాబు కాళ్లకు మొక్కడం విడ్డూరంగా ఉందన్నారు. వాస్తవంగా అనుమతులు తెచ్చిన వారికి కాళ్లకు మొక్కాల్సి వస్తే ముందుగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కాళ్లకు మొక్కాలని పేర్కొన్నారు. గతంలో ఎన్‌ఎస్పీ కాలనీ ఖాళీ చేసే సమయంలో చెట్లు ఇతర పాతబడిన భవనాల సామగ్రి తరలించిన వారిపై ఇప్పుడు కేసులు నమోదు చేయడమేమిటి అని ప్రశ్నించారు. వంద పడకల ఆసుపత్రికి 2022లోనే అనుమతులు తెచ్చామని నాబార్డ్‌ ద్వారా రూ.45.50 కోట్లు నిధులు కూడా తీసుకొచ్చామని నేటికీ నిధులు ఉన్నాయని చేతనైతే వంద పడకల ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేయాలని అన్నారు. అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబును జీవీ ఆంజనేయులు మించిపోయారని పేర్కొన్నారు. రూ.240 కోట్లు మున్సిపాలిటీకి మంజూరయ్యాయని చెబుతున్న జీవీ జీఓను చూపించాలని డిమాండ్‌ చేశారు. మా హయాంలో జరిగిన అభివృద్ధి పనులకు శిలాఫలకాలు మార్చి మీ పేర్లు వేయించుకోవడం తప్ప అభివృద్ధి చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. 100 కుటుంబాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తామంటున్న మీరు వంద కుటుంబాల పేర్లు చెప్పగలరా అని ప్రశ్నించారు. 2014లో వినుకొండకు వెటర్నరీ, హార్టికల్చర్‌ కళాశాల మంజూరు చేస్తామన్న చంద్రబాబు నాయుడు మళ్లీ అవే కళాశాల మంజూరు చేస్తామని చెప్పడం ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. నిజంగా మీరు కళాశాలు నిర్మిస్తే అనుమతులు మంజూరై ఉన్నాయని తెలిపారు. వంద ఎకరాల భూమి మాత్రం మీ నాయకులే సగం భూమి కబ్జా చేశారన్నారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఎక్కడ అమలు చేశారని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు.

వరికపూడిశెల సంగతి ఏంటి...

పల్నాడు ప్రాంత వాసుల చిరకాల వాంఛ వరికపూడిశెల ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారని బొల్లా అన్నారు. వాటర్‌ గ్రిడ్జ్‌ పేరుతో కొత్త నాటకానికి తెర లేపారని పేర్కొన్నారు. బొల్లాపల్లి మండలంలో 22 గ్రామాల రైతులను బనకచర్ల ప్రాజెక్టు పేరుతో రిజిస్ట్రేషన్‌ జరగకుండా ఇబ్బందులు పెడుతున్నారని, కనీస అవసరాలకు కూడా ఒక సెంటు భూమి అమ్ముకోలేని పరిస్థితికి తెచ్చారని ఈ పాపం మీది కాదా అని ప్రశ్నించారు. మీరు వినుకొండ అభివృద్ధి చేస్తే సంతోషించే మొదటి వ్యక్తిని నేనని ఇప్పటికై నా అభివృద్ధిని చేసి చూపించాలని సూచించారు. సమావేశంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అమ్మిరెడ్డి అంజిరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ఎంఎన్‌ ప్రసాద్‌, పట్టణ కన్వీనర్‌ కొత్తమాసు శివ, జెడ్పీటీసీ సభ్యురాలు విజయలక్ష్మి, వినుకొండ మండల కన్వీనర్‌ దండు చెన్నయ్య, నూజెండ్ల మండలం కన్వీనర్‌ ముప్పరాజు వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్‌ చింతా నాగిరెడ్డి, అర్ధిటి శివ, పట్టణ బీసీ సెల్‌ అధ్యక్షులు గుంజి వాసు, రెడ్డిబోయిన ప్రవీణ్‌కుమార్‌తోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement