ఆధార్ చెల్లదు..వెనక్కి పోండి
● సాల్మన్ అంత్యక్రియల్లో
పాల్గొనకుండా నిలువరించే ప్రయత్నం చేసిన పోలీసులు
● తిరగబడిన బంధువులు,
మహిళలు, గ్రామస్తులు
సాక్షి, టాస్క్‌ఫోర్స్ : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జారీ చేసిన ఆధార్ కార్డులపైనే పోలీసులు ఆంక్షలు విధించారు. మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో టీడీపీ గుండాల చేతిలో హత్యకు గురైన వైఎస్సార్‌సీపీ దళిత కార్యకర్త మందా సాల్మన్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వస్తున్న వేలాదిమంది అభిమానులు, కార్యకర్తలు, బంధువులను పోలీసులు నిలిపివేశారు. ఆధార్‌కార్డు చూపించినా నిలిపి వేయటంతో తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సాల్మన్ అంత్యక్రియలు స్వగ్రామమైన పిన్నెల్లిలో నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు నిర్ణయించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పిన్నెల్లిలోని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులను బెదిరించి భయపెట్టి గ్రామంలో ఉండకుండా చేశారు. వీరిలో సాల్మన్‌తో పాటు వారి కుటుంబ సభ్యులు, బంధువులు కూడా ఉన్నారు. ఈ క్రమంలో సాల్మన్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వీరంతా బయలుదేరారు. తుమ్మలచెరువు చెట్టు, బ్రాహ్మణపల్లి, మాచవరం వద్ద పోలీసులు తనిఖీల పేరుతో వేధించటం ప్రారంభించారు. పిన్నెల్లి అడ్రస్‌తో ఆధార్‌కార్డులు ఉన్నా పోలీసులు అడ్డుకున్నారు.
తిరగబడ్డ మహిళలు, ప్రజలు:
తనిఖీలు, శాంతిభద్రతల పేరుతో పోలీసులు పిన్నెల్లి వెళ్లకుండా సాల్మన్ కుటుంబ సభ్యులు, బంధువులు, ప్రజలను అడ్డుకోవటంతో అగ్రహం వ్యక్తం చేశారు. ఆధార్‌కార్డులు చూపించినా వెళ్లనీయకపోవటంతో మహిళలు తిరగబడ్డారు. మా ఊరికి...మా ఇళ్లకు మమ్మల్ని వెళ్లకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు. చావనైన చస్తాం పిన్నెల్లి వెళ్లి తీరాల్సిందేనని మహిళలు, ప్రజలు పట్టుబట్టారు. సాల్మన్ పెద్దకుమారుడు, భార్యని కూడా అంత్యక్రియలకు వస్తుంటే అడ్డుకున్నారు. హత్యకు గురైంది నా సొంతమామ అని చెప్పినా ఇబ్బందులు పెట్టారు.
కాలిబాటన పిన్నెల్లి చేరిక
పిన్నెల్లి చుట్టూ పోలీసులు భద్రతా వలయం ఏర్పాటు చేయటంతో పాటు తనిఖీలు ముమ్మరంగా చేయటంతో గ్రామస్తులు, కార్యకర్తలు, నాయకులు కాలి బాటన అతికష్టం మీద పిన్నెల్లి చేరుకున్నారు. తుమ్మల చెరువు, వీరాపురం కాలువకట్ట, మాచవరం పొలాల్లో నుంచి పిన్నెల్లి చేరుకుని సాల్మన్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు.


