హత్యలు చేస్తున్నారు..
అభివృద్ధిలో పోటీ పడలేక
నరసరావుపేట: గురజాల నియోజకవర్గాన్ని తాను అన్నీ విధాలుగా అభివృద్ధి చేస్తే తనతో పోటీపడలేని టీడీపీ నాయకులు హత్యలు చేస్తున్నారని గురజాల మాజీ శాసనసభ్యులు కాసు మహేష్‌రెడ్డి పేర్కొన్నారు. పిన్నెల్లిలో పార్టీ కార్యకర్త మందా సాల్మన్ హత్యను పురస్కరించుకొని ప్రభుత్వం అనుసరించిన విధానంపై నరసరావుపేటలోని తన క్యాంపు కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్యాయంగా మందా సాల్మన్‌ను చంపారని, చాలా బాధగా ఉందన్నారు. చనిపోయిన సాల్మన్ మృతదేహాన్ని గ్రామంలోకి తీసుకురాకూడదని చెప్పటం వారి పెత్తందారీతనాన్ని గుర్తు చేస్తోందన్నారు. ఇది ఎంతో కాలం చెల్లదన్నారు. దాడికి గురై కోమాలో సాల్మన్ ఉంటే పోలీసులు చాలా చిన్న సెక్షన్‌న్ 324 వేశారని, ఆ పోలీసులకు చుక్కలు చూపిస్తామని హెచ్చరించారు. హైకోర్టులో పదికేసులు ఉన్నాయని, మరో కేసు వేస్తామని హెచ్చరించారు. హత్య చేసిన వారిని మూడు రోజులపాటు పట్టుకోలేదని అన్నారు. సాల్మన్ మృతదేహాన్ని దహనం కోసం ధర్నా చేయాల్సి వచ్చిందన్నారు. మృతదేహం ఇంటికి తీసుకురాకూడదా అని ప్రశ్నించారు. సాల్మన్ కుటుంబాన్ని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వద్దకు తీసుకెళతామని, వారి కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు. ఎస్సీ, ఎస్టీలు అధికంగా ఉండే పిన్నెల్లిలో తాము ఐదేళ్లలో రూ.50 కోట్లతో అభివృద్ధి చేశామని, రూ.15 నుంచి రూ.20కోట్ల సంక్షేమం పంపిణీ చేశామని, 600 మందికి ఇళ్లపట్టాలు ఇచ్చామని చెప్పారు. రూ.3 కోట్లతో తాగునీటి పథకం, రూ.4 కోట్లతో సీసీ రోడ్డు, మరో రూ.2 కోట్లతో హైస్కూలు, పాఠశాల బాగుచేశామన్నారు. గ్రామాన్ని ఒక ఉన్నతంగా తీర్చిదిద్దామన్నారు. ప్రభుత్వం మారగానే వైఎస్సార్ సీపీకి ఓటు వేశారనే కారణంతో 200 కుటుంబాలను గ్రామం నుంచి తరిమేశారన్నారు. ఇది పూర్తిగా అన్యాయమన్నారు. ప్రభుత్వం తీరు కారణంగా రూ.20 లక్షలు పలికే పొలాల ధరలు పడిపోయాయని, ఊరుపేరు చెబితే పెండ్లి సంబంధాలు కూడా రావట్లేదన్నారు. డీఎస్పీతో ఒక కమిటీ వేసి పిన్నెల్లి పరిస్థితిపై చర్చించాలన్నారు. వ్యవస్థలో మార్పు తీసుకొచ్చేందుకు తాను ప్రయత్నం చేశానన్నారు. 2004 నుంచి ఏ ఎన్నికల్లోనూ బాంబు మోతలు వినపడకుండా చేశామన్నారు. ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు 30 ఏళ్లుగా చేస్తున్న దొమ్మిలను వదిలి ఇప్పటికై నా మారాలని సూచించారు. అభివృద్ధిలో పోటీపడాలని అన్నారు. సమావేశంలో మాజీ ఎంపీపీ ముడాల వెంకటేశ్వరరెడ్డి, బీసీ విభాగం మాజీ అధ్యక్షులు సిద్దారపు గాంధీ, మాజీ మండల పరిషత్ అధ్యక్షులు చింతపల్లి పెద్దసైదా, జిల్లా ఎస్‌సీ సెల్ ఉపాధ్యక్షులు కాలే మాణిక్యాలరావు, చల్లగుండ్ల స్వామి పాల్గొన్నారు.
విలేకర్ల సమావేశంలో గురజాల
మాజీ శాసనసభ్యులు కాసు మహేష్‌రెడ్డి


