సాగు నీటి కోసం రోడ్డెక్కిన రైతులు
నరసరావుపేటరూరల్/ముప్పాళ్ల: ఎండిపోతున్న మొక్కజొన్న పంటకు నీళ్లిచ్చి కాపాడాలంటూ రైతులు రోడ్డెక్కారు. నరసరావుపేట మండలం ములకలూరు, ముప్పాళ్ల మండలం కుందురువారిపాలెం, గోళ్లపాడు గ్రామాలకు చెందిన రైతులు నరసరావుపేట–సత్తెనపల్లి ప్రధాన రహదారిపై ములకలూరు సమీపంలోని విజయలక్ష్మీ టౌన్‌షిప్ ఎదుట ట్రాక్టర్‌లు అడ్డుగా పెట్టి చేతుల్లో మొక్కజొన్న పైరును చూపిస్తూ శనివారం గంటపాటు రాస్తారోకో చేశారు. పైరు కండెదశలో ఉందని, ఈ సమయంలో నీరు అందకపోతే పంట పూర్తిగా దెబ్బతిని నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వారబందీ పేరుతో సాగర్‌ఆయకట్టు పరిధిలోని కాల్వలకు ప్రభుత్వం నీటిని నిలిపివేసిందని, ఈ విధానంతో పంట చేతికందకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పక్క రాష్ట్రంలో వారి ఆయకట్టుకు కావాల్సిన నీటిని తీసుకెళ్తుంటే మన అధికారులు మాత్రం రైతుల ఇబ్బందులు పట్టించుకోకుండా వారబందీ పేరుతో నీటిని నిలిపివేయటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు, టీడీపీ ప్రభుత్వ పెద్దలు బాధ్యత తీసుకొని పంటకు కావాల్సిన నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ములకలూరు మేజర్ పరిధిలో సుమారు 1,500 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు.
నరసరావుపేట–సత్తెనపల్లి ప్రధాన రహదారిపై ట్రాక్టర్‌లు అడ్డుపెట్టి కాల్వలకు నీటిని విడుదల చేయాలంటూ మూడు గ్రామాలకు చెందిన రైతులు సుమారు గంటపాటు రాస్తారోకో చేపట్టారు. దీంతో ఇరువైపులా కిలో మీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి. అధికారులు వచ్చి నీటి విడుదలపై స్పష్టమైన హామీ ఇస్తే తప్ప రాస్తారోకో విరమించేది లేదని రోడ్డు పై బైఠాయించి పంటను కాపాడాలంటూ నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న నరసరావుపేట రూరల్ పోలీసులు, ముప్పాళ్ళ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రైతులకు నచ్చచెప్పే పరిస్థితి చేసినా ఫలితం లేకుండా పోయింది. అధికారులు వచ్చి స్పష్టమైన హామీ ఇవ్వాలంటూ నినాదాలు చేయటంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొద్దిసేపటి తర్వాత పోలీసులు రైతులతో మాట్లాడి రాస్తారోకో విరమింప చేశారు. ఇంత జరుగుతున్నా ఎన్‌ఎస్‌పీ అధికారులు కన్నెత్తి చూసిన దాఖలాలు లేకపోవటంతో రైతులు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. పంటలకు నీటి సరఫరా చేయకపోతే ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టంచేశారు.
భారీగా ట్రాఫిక్‌జామ్...
నాగార్జున సాగర్ కుడికాలువ
పరిధిలో వారబందీ అమలు
ములకలూరు మేజర్ పరిధిలో వారం రోజులుగా నిలిచిన
నీటి సరఫరా
నీరు అందక మొక్కజొన్న
ఎండుతుందంటూ రైతుల ఆందోళన
ములకలూరు సమీపంలో
మూడు గ్రామాల రైతుల ఆందోళన
పెద్ద ఎత్తున నిలిచిపోయిన ట్రాఫిక్
1/1
సాగు నీటి కోసం రోడ్డెక్కిన రైతులు