ఏది న్యాయం...? ఎక్కడుంది ధర్మం..?
అంతిమ సంస్కారాల్లోనూ సంస్కారం మరిచి...
అభిమానంతో ప్రతిపక్ష నాయకుడి ఫ్లెక్సీ ముందు కోడిని కోసినవారిపై కేసులు పెట్టి రోడ్లపై నడిపించి అరెస్ట్ చూపే పోలీసులు... అమాయకుడైన దళిత వ్యక్తిపై అధికార టీడీపీ గూండాలు
విచక్షణారహితంగా దాడి చేసినా కనీసం పట్టించుకోరు. నిందితులను పట్టుకోవడం దేవుడెరుగు? పైగా, తీవ్ర గాయాలతో చావుబతుకుల్లో ఉన్న బాధితుడిపైనే కేసు నమోదు పెడతారు.
వైఎస్సార్‌సీపీ అభిమానులు వినాయక చవితి శుభాకాంక్షలతో ఫ్లెక్సీలు పెడితే దగ్గరుండి మరీ తీసేయించే పోలీసులు... దారుణ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి అంతిమ సంస్కారాలనూ వదలకుండా రెచ్చగొట్టేలా పచ్చమూక ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే అదేమీ కనిపించదు.
సాక్షి, టాస్క్‌ఫోర్స్ : ప్రతిపక్ష పార్టీనే టార్గెట్‌గా చంద్రబాబు సారథ్యంలోని టీడీపీ ప్రభుత్వం రెడ్‌బుక్ రాజ్యాంగం ప్రవేశపెడితే... పోలీసులు దాని అమలుకు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి, మరీ ముఖ్యంగా పల్నాడు జిల్లాలో ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా పచ్చమూకలు దాడులు, హత్యలకు తెగబడుతున్నాయి. వందలమంది వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులను గ్రామాల నుంచి వెళ్లగొట్టారు. ఈ పరిస్థితుల్లో బాధితులకు పోలీసులు రక్షణ కల్పించి, తిరిగి సొంతూళ్లకు వచ్చేలా చేయాలి. కానీ, వారు అధికార పార్టీ రౌడీ మూకలకు అండగా నిలుస్తున్నారు. అరాచకాలు చేస్తున్న పచ్చ గూండాలపై కాక బాధితులపైనే అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు. ఇలాటి అక్రమ కేసులపై హైకోర్టు ఎన్ని మొట్టికాయలు వేసినా పోలీసుల తీరు మారడం లేదు.
పొలిటికల్ బాస్‌ల ఆదేశాలకు జీ హుజూర్
పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం మాచవరం మండలం పిన్నెల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ దళిత కార్యకర్త మందా సాల్మన్ (65)పై అదే గ్రామ టీడీపీ నేతలు మోటుమర్రి పేతురు, అతడి తమ్ముడు కాంతారావు విచక్షణారహితంగా దాడి చేసిన ఘటనలో పోలీసుల తీరు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. 19 నెలలుగా గ్రామాన్ని వదిలి ఉంటున్న సాల్మన్... అనారోగ్యంతో ఉన్న భార్యను చూసేందుకు రాగా టీడీపీ నాయకులు ఇనుపరాడ్లతో దాడి చేసి చావగొట్టారు. టీడీపీ రౌడీమూకపై హత్యాయత్నం కేసు నమోదు చేయాల్సిన పోలీసులు సాధారణ గొడవగా నమోదు చేశారు. సాల్మన్‌పై టీడీపీకి చెందిన పేతురు సోదరులే దాడి చేశారని ప్రత్యక్ష సాక్షులైన ఆయన భార్య, పక్కింటి వ్యక్తి నెత్తినోరు కొట్టుకుని చెబుతున్నా... పైకి తిరిగి కోమాలో ఉన్న సాల్మన్‌పైనే కేసు పెట్టారు. ఈ ఉదాహరణ పోలీసుల తీరు ఎలా ఉందో చాటుతోంది. కాగా, గురజాల ఎమ్మెల్యే యరపతినేని అండతో దాచేపల్లి సీఐ భాస్కర్ చేస్తున్న అకృత్యాలు అన్నీ ఇన్ని కావనే ఆరోపణలు వస్తున్నాయి. హైకోర్టు తప్పుబట్టినా పోలీసు ఉన్నతాఽఽధికారులు మాత్రం చర్యలు తీసుకోకుండా కొనసాగిస్తున్నారనే విమర్శలున్నాయి.
వారం గడిచినా అరెస్ట్ ఏది?
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వైఎస్సార్‌సీపీ దళిత కార్యకర్త మందా సాల్మన్ హత్య కేసులో నిందితులను ఇప్పటికీ పల్నాడు పోలీసులు అరెస్ట్ చేయలేదు. కేసు నమోదు చేసి వారం దాటినా శనివారం సాయంత్రం వరకు నిందితులు మోటుమర్రి పేతురు, కాంతారావు, ఇతరులను అదుపులోకి తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సాల్మన్‌పై ఈ నెల 10న ఉదయం దాడి జరగ్గా, ఆరు రోజులు చికిత్సం పొంది 15న మృతి చెందారు. అయితే, శుక్రవారం అంత్యక్రియల కోసం మృతదేహాన్ని పిన్నెల్లికి తీసుకొస్తున్న సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరు అన్యాయమని దళిత నేతలు ఆగ్రహిస్తున్నారు. అంత్యక్రియలు సాఫీగా జరిగేలా చూడాల్సిన యుద్ధ వాతావరణం సృష్టించారు. మృతదేహాన్ని గ్రామంలోకి తీసుకెళ్లకుండా బారికేడ్లు, భారీగా బలగాలను దింపారు. మృతదేహాన్ని తరలిస్తున్న అంబులెన్స్‌నూ తనిఖీ చేసి దారుణంగా ప్రవర్తించారు. శాంతిభద్రతల సాకుతో సాల్మన్ కుటుంబసభ్యులు, బంధువులు గ్రామంలోకి వెళ్లకుండా ఆంక్షలు పెట్టారు. అయితే, ఇదే సమయంలో పిన్నెల్లిలో టీడీపీ నాయకులు రెచ్చగొట్టేలా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసినా అడ్డుకోలేదు.
హైకోర్టు మొట్టికాయలు వేసినా
తీరు మార్చుకోని రాష్ట్ర పోలీసులు
టీడీపీ రెడ్‌బుక్ రాజ్యాంగానికి
వంత పాడుతున్న వైనం
పిన్నెల్లిలో వైఎస్సార్ సీపీకి చెందిన
వందల కుటుంబాలను వెళ్లగొట్టిన
పచ్చ గూండాలు
బాధితులకు రక్షణ కల్పించకపోగా
గ్రామంలోకి రావొద్దని పోలీసుల
బెదిరింపులు
అనారోగ్యంతో ఉన్న భార్యను
చూసేందుకు వచ్చిన దళితుడు
సాల్మన్‌పై దారుణంగా టీడీపీ
నేతల దాడి
కోమాలో ఉన్న ఆయనపైనే కేసు
నమోదు చేసిన దాచేపల్లి సీఐ భాస్కర్
సాల్మన్‌ను హత్య చేసిన నిందితులను
ఇప్పటికీ అరెస్ట్ చూపని పోలీసులు
శాంతిభద్రతల సాకుతో ఆయన
అంత్యక్రియలను సైతం
అడ్డుకునే కుట్రలు
పిన్నెల్లిలో రెచ్చగొట్టేలా టీడీపీ నేతలు
ఫ్లెక్సీలు కట్టినా తొలగించకుండా
రక్షణ
ఏది న్యాయం...? ఎక్కడుంది ధర్మం..?
ఏది న్యాయం...? ఎక్కడుంది ధర్మం..?


