మందా సాల్మన్‌ది ప్రభుత్వ హత్యే
టీడీపీ నేతలే హత్య చేశారు..
సాల్మన్ కుటుంబంపై కేసు దుర్మార్గం
ఎమ్మెల్యే తీరు దారుణం
దళితుడిపై దాడి దారుణం
ఏ ప్రభుత్వం ఇలా చేయలేదు
గుండాయిజం పెరిగింది
రెడ్‌బుక్ వల్లే హత్యలు
వైఎస్సార్ సీపీ నేతలు
● బాధ్యులైన పోలీసు అధికారులపై
చర్యలు తీసుకోవాలి
● దారుణ ఘటనపై జాతీయ
స్థాయిలో పోరాటం
● చంద్రబాబు పాలనలో రౌడీ రాజ్యం
● రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం
అమలవుతోంది
● సాల్మన్ హత్యకు నిరసనగా వైఎస్సార్
సీపీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో నిరసన
● పార్టీ కార్యాలయం నుంచి డాక్టర్
బీఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ
● విగ్రహం ఎదుట రోడ్డుపై కూర్చోని ధర్నా
నరసరావుపేట: గురజాల నియోజకవర్గం మాచవరం మండలం పిన్నెల్లిలో వైఎస్సార్ సీపీ దళిత కార్యకర్త మందా సాల్మన్‌ను టీడీపీ నాయకులు తీవ్రంగా కొట్టడం వల్లనే మృతి చెందాడని, ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని పార్టీ అగ్ర నాయకులు పేర్కొన్నారు. సాల్మన్ హత్యను నిరసిస్తూ పార్టీ పిలుపు మేరకు ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు కొమ్ము చంద్రశేఖర్ ఆధ్వర్యంలో శనివారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. గుంటూరురోడ్డులోని పార్టీ కార్యాలయం నుంచి పట్టణ నడిబొడ్డున ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో అంబేద్కర్ విగ్రహం ఎదురు రోడ్డుపై కూర్చోని నిరసన వ్యక్తం చేశారు. సాల్మన్ కుటుంబానికి న్యాయం చేయాలని, రెడ్‌బుక్ రాజ్యాంగం నశించాలని, చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ డౌన్ డౌన్, హత్యచేసిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని, పోలీసు జులుం నశించాలంటూ నినాదాలు చేశారు. డాక్టర్ అంబేద్కర్‌కు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గంటెనపాటి గాబ్రియేలు, ఎస్సీ విభాగం జిల్లా ఉపాధ్యక్షులు కాలే మాణిక్యాలరావు, జిల్లా కార్యదర్శులు ఎస్.సుజాతాపాల్, నేలటూరి సురేష్, యువజన విభాగ జిల్లా అధ్యక్షులు కందుల శ్రీకాంత్, విద్యార్థి విభాగ నియోజకవర్గ అధ్యక్షులు మనీంద్రరెడ్డి, సోషల్ మీడియా నియోజకవర్గ అధ్యక్షులు బూదాల కల్యాణ్, పట్టణ అధ్యక్షులు షేక్ కరిముల్లా, ఎస్సీ సెల్ పట్టణ కార్యదర్శి పౌలయ్య, బీసీ విభాగం నియోజకవర్గ అధ్యక్షులు మర్రిపూడి రాంబాబు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీడియాను ఉద్దేశించి నాయకులు మాట్లాడారు.
వైఎస్సార్ సీపీ దళిత కార్యకర్త సాల్మన్‌ను టీడీపీ నేతలు అత్యంత దారుణంగా కొట్టారు. సాల్మన్ బంధువులు పోలీసులకి ఫోన్ చేసినా స్పందించలేదు. పైగా ఊరిలోకి ఎవరు తిరిగి రమ్మన్నారని బదులివ్వడం బాధాకరం. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో లోకేష్ రాసిన రెడ్‌బుక్ రాజ్యాంగమే అమలవుతుంది. పోలీసులు లా అండ్ ఆర్డన్‌ను పూర్తిగా గాలికొదిలేశారు. దళిత కార్యకర్తను హత్య చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలి. వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు జోలికొస్తే వదిలిపెట్టేది లేదు. చట్టం ముందు దోషులుగా నిలబెడతాం.
– విడదల రజిని, మాజీ మంత్రి
టీడీపీ నేతల దాడిలో సాల్మన్ చనిపోతే.. పోలీసులు దుర్మార్గంగా అతని కుటుంబంపై కేసులు నమోదు చేయటం దారుణం. కేసును మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నంలో భాగమే ఇది. చనిపోయిన సాల్మన్ మృతదేహాన్ని పిన్నెల్లి గ్రామంలోకి రానివ్వకుండా అంతిమ సంస్కారాలు కూడా అందకుండా అడ్డుకునే ప్రయత్నం చేయటం అమానవీయం. సాల్మన్ హత్య కేసులో నిందితులను 24 గంటలలోగా అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. కేసు నమోదులో తాత్సారం చేయడంతోపాటు బాధితులపై కేసు నమోదు చేయడానికి ప్రయత్నించిన పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలి.
–డాక్టర్ గోపిరెడ్డి, పార్టీ జిల్లా
కార్యనిర్వాహక అధ్యక్షులు
స్థానిక ఎమ్మెల్యే మానవత్వంతో వ్యవహరించకపోవడం దారుణం. పోలీసు వ్యవస్థ పనితీరు రాష్ట్రంలో అత్యంత దారుణంగా ఉంది. ఈ విధమైన వ్యవస్థ ఉన్నంత కాలం సాల్మన్ లాంటి వ్యక్తులు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంటుంది. కూటమి పాలనను ప్రజలు చీత్కరించుకుంటున్నారు. సాల్మన్ హత్యను వైఎస్సార్ సీపీ తరపున పూర్తిగా ఖండిస్తున్నాం. టీడీపీ నాయకులు పద్ధతి మార్చుకోవాలి.
–బొల్లా బ్రహ్మనాయుడు, మాజీ ఎమ్మెల్యే, వినుకొండ నియోజకవర్గ సమన్వయకర్త
పల్నాడులో అధికార పార్టీ రౌడీయిజం, గూండాయిజం పెచ్చుమీరుతుందనడానికి సాల్మన్ హత్యే నిదర్శనం. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో ఎనిమిది మంది హత్యకు గురయ్యారని, వందలాది మందిని క్షతగాత్రులను చేశారు. దీనిపై వైఎస్సార్ సీపీ కచ్చితంగా పోరాటం చేస్తుంది. సాల్మన్ మృతదేహం వద్దకు అతని కుటుంబసభ్యులను రానివ్వకపోవడం అత్యంత దుర్మార్గం. కచ్చితంగా అధికార పార్టీ దీనికి తగిన మూల్యం చెల్లించుకోకతప్పదు.
–పూనూరి గౌతమ్‌రెడ్డి, జిల్లా సమన్వయకర్త
వైఎస్సార్ సీపీకి చెందిన దళిత సోదరుడిపై జరిగిన దాడి దారుణం. టీడీపీ నేతల దాడి వెనుక పోలీసుల నిర్లక్ష్యం ఉంది. అధికార పార్టీ గూండాయిజానికి ఇదే నిదర్శనం. ప్రభుత్వం తక్షణమే హత్య చేసిన వారిని శిక్షించడంతో పాటు సాల్మన్ కుటుంబానికి న్యాయం చేయాలి.
–నంబూరు శంకరరావు,
మాజీ ఎమ్మెల్యే
ఏ ప్రభుత్వం కూడా ఈ స్థాయిలో కక్ష సాధింపు చర్యలకు పాల్పడిన దాఖలాలు లేవు. సంక్రాంతి పండగకు సొంత గ్రామానికి రాలేని పరిస్థితి. కుటుంబసభ్యులకు ఆరోగ్యం సరిగ్గా లేకపోతే ఇంటికి వచ్చిన సాల్మన్‌ను టీడీపీ నేతలు రాడ్లతో కొట్టి హత్యచేశారు. సాల్మన్ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుంది. వా రికి న్యాయం జరిగేవరకు పోరాటం చేస్తాం.
–గజ్జల సుధీర్ భార్గవ్‌రెడ్డి, సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త
పల్నాడులో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతోంది. 200 కుటుంబాలను గ్రామం నుంచి తరిమేశారు. భార్యకు ఆరోగ్యం సరిగా లేకపోతే పిన్నెల్లి వచ్చిన సాల్మన్‌ను కొట్టి చంపారు. కేసు కట్టమని కోరితే.. కోమాలో ఉన్న సాల్మన్ మీద 324 కేసు పెట్టారు. బాధ్యులను వదిలేశారు. పరిస్థితి సీరియస్‌గా ఉందని తెలిసి వాళ్ల మీద 342 కేసు పెట్టారు. సాల్మన్ చనిపోవడంతో కేసును 302గా మారుస్తామని చెబుతున్నారు. దీనికి కారణమైన సీఐ, ఎస్‌ఐలను సస్పెండ్ చేయాలి. సాల్మన్ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలి.
–కాసు మహేష్‌రెడ్డి, గురజాల మాజీ ఎమ్మెల్యే
మందా సాల్మన్‌ది ప్రభుత్వ హత్యే


