అక్రమ నిర్మాణాలు తొలగింపు
తాడికొండ: తాడికొండ చెరువు కట్టపై అక్రమ నిర్మాణాలను ఆదివారం అధికారులు తొలగించారు. 200 మందికిపైగా పోలీసులను మోహరించి, ఉదయం 6 గంటల నుంచే తొలగింపు ప్రారంభించారు. ముందుగా హిందువుల భజన మందిరం పేరిట నిర్మిస్తున్న కట్టడాన్ని తొలగించారు. ఎదురుగా నిర్మాణం ప్రారంభించిన మసీదు కట్టడాన్ని తొలగించారు. చెరువు అక్రమణలపై కోర్టులో కేసు నడుస్తున్నందున నాలుగు సంవత్సరాలుగా తాత్కాలికంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న మసీదు నిర్మాణాన్ని తొలగించకుండా వదిలేశారు. అనంతరం సదరు ఆక్రమణ ప్రాంతానికి ఫెన్సింగ్ వేయించి కట్టుదిట్టం చేశారు. గ్రామంలో పోలీసు పికెటింగ్ కొనసాగుతోంది, కొద్ది రోజులపాటు బందోబస్తు ఉంటుందని సీఐ కె.వాసు తెలిపారు. తుళ్ళూరు డీఎస్పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మెహర్ కుమార్, ఆర్‌ఐ హనుమంతరావు, పలువురు సీఐలు, ఎస్‌ఐలు, ఈవోఆర్డీ రమణయ్య, కార్యదర్శి రెహ్మాన్ తదితరులు పాల్గొన్నారు.


