కృష్ణానదిలో తప్పిన పడవ ప్రమాదం
వేదాద్రి(జగ్గయ్యపేట): కృష్ణానదిలో ప్రయాణిస్తున్న పడవకు ప్రమాదం తప్పటంతో ప్రయాణికులు ఊపీరి పీల్చుకున్నారు. గ్రామంలోని యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్దనున్న కృష్ణానది నుంచి పల్నాడు జిల్లా గింజుపల్లి మధ్య పడవలో నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. సాయంత్రం ఐదు గంటల సమయంలో వేదాద్రి నుంచి 30 మంది ప్రయాణికులతో పడవ గింజుపల్లికి బయలుదేరింది. ఈ క్రమంలో ఒక్కసారిగా నది మధ్యలోకి వెళ్లగానే ఇంజన్ ఆగిపోవటంతో కొంత మేర దిగువకు కొట్టుకుపోయింది. దీంతో ప్రయాణికులు ఆర్తనాదాలు చేయటంతో పడవ సిబ్బంది నదిలోకి దిగి సురక్షితంగా రెండు గంటల పాటు శ్రమించి పడవను గింజుపల్లి వైపు ఒడ్డుకు చేర్చారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. వీరంతా పల్నాడు జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన వారు. పడవలో నిబంధనలు పాటించకపోవటం, లైఫ్ జాకెట్లు లేకపోవటంతో పాటు పడవ రాకపోకలకు అనుమతులున్నాయో లేదో తెలియదంటున్నారు స్థానికులు. పడవ ఇంజన్ ఆగిపోయి రెండు గంటల పాటు నదిలో ఉన్నప్పటికీ ఏ ఒక్క అధికారి అటువైపు కన్నెత్తి చూడకపోవటం గమనార్హం.
30 మంది ప్రయాణికులు సురక్షితం


