కోర్టు స్టే ఉన్నా.. డోంట్‌కేర్!
లెక్కచేయని సంగం డెయిరీ నిర్వాహకులు తన రెండు డెయిరీలు స్వాధీనం చేసుకున్నారని బాధితుడి ఆవేదన
నరసరావుపేట: కోర్టులో స్టే ఆర్డర్ ఉన్నా సంగం డెయిరీ నిర్వాహకులు తన ఆస్తిని ఆక్రమించారని చిలకలూరిపేట పండరీపురానికి చెందిన గుడిపాటి సంజీవరెడ్డి పేర్కొన్నారు. గురువారం వైఎస్సార్ సీపీ కార్యాలయంలో తనకు జరిగిన అన్యాయాన్ని మీడియాకు వివరించారు. తనకు రొంపిచర్లలో శ్రీ వెంకటేశ్వర డెయిరీ, ప్రకాశం జిల్లా వంగలూరు మండలం కొండమూడూరు పంచాయతీలో వెంకటేశ్వర డెయిరీ ఉందన్నారు. రెండు డెయిరీలను సంగం డెయిరీ వారు బ్యాంకు నుంచి కొన్నారన్నారు. దీనిపై తాను వైజాగ్ కోర్టు నుంచి స్టే పొందానని చెప్పారు. ఆ స్టే ఆర్డర్ ఉండగా వారు బ్యాంకు వద్ద నుంచి రిజిష్ట్రర్ చేయించుకున్నారన్నారు.
2024 మే నెలలో ఆ విషయం వైజాగ్ కోర్టుకు తెలియచేయగా స్టే ఆర్డర్ ఉండంగా సేల్‌డీడ్ ఏవిధంగా చేస్తారంటూ బ్యాంకు నిర్వహించిన ఆక్షన్, సేల్ డీడ్‌లను కొట్టేశారన్నారు. ఆ కోర్టు కాపీతో రిజిస్ట్రార్‌ను సంప్రదించగా తన పేరుపై ఆ ఆస్తులను రిజిస్టర్ చేశారన్నారు. ఆన్‌లైన్ ఈసీలో తన పేరే ఉందన్నారు. అయినప్పటికీ సంఘం డెయిరీ మేనేజర్, ఇతర ఉద్యోగులు తనను లెక్కచేయకుండా బయటకు నెట్టి ఆస్తులను స్వాధీనం చేసుకున్నారన్నారు. ఆ డెయిరీలలో పనులు చేయమని తమకు చెప్పారని, మీకు చేతనైననది చేసుకోమని తనకు ఉచిత సలహా ఇచ్చారన్నారు. రొంపిచర్ల ఎస్‌ఐను కలిసి జరిగిన విషయం చెబితే వారి దౌర్జన్యాన్ని తాను ఆపలేనని కోర్టులోనే తేల్చుకోవాలని సూచించారన్నారు. ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే పీజీఆర్‌ఎస్‌కు వెళ్లి జరిగింది చెబితే, స్టే ఆర్డర్ ఉండగా వారెలా చేశారనీ, దీనిపై కోర్టులో కంటెప్టంట్ పిటిషన్ దాఖలు చేయాలని సూచించారని చెప్పారు. నేను అడిగిన మీదట తనకు లెటర్ కూడా ఇచ్చారని, అది కోర్టుకు సబ్‌మిట్ చేశానని స్పష్టం చేశారు. దీనిపై తనకు న్యాయం చేయాలని మీడియా ముఖంగా సంజీవరెడ్డి కోరారు.


