క్లస్టర్ వ్యవస్థకు మంగళం
స్పెషల్ గ్రేడ్ పంచాయతీ అంటే
వసూళ్లపై దృష్టి పెట్టేందుకేనా?
ఇక గ్రామ పంచాయతీలకు స్వయం ప్రతిపత్తి హోదా
నాలుగు గ్రేడ్లుగా గ్రామ పంచాయతీల విభజన
కార్యదర్శి హోదా పంచాయతీ అభివృద్ధి అధికారిగా మార్పు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇదే పంథా
అన్ని విభాగాలను నిర్వీర్యం చేసే దిశగా కుట్ర
సత్తెనపల్లి: గ్రామ పంచాయతీల్లో క్లస్టర్ వ్యవస్థకు కూటమి ప్రభుత్వం మంగళం పాడింది. వాటి స్థానంలో పంచాయతీలకు స్వయం ప్రతిపత్తి హోదా కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలా ఉంటే సాఫీగా నడుస్తున్న వ్యవస్థలను గందర గోళానికి గురిచేయడం తగదన్న వాదన వినిపిస్తోంది. సంస్కరణల పేరుతో ఇప్పటికే గ్రామ పంచాయతీలు, రైతు భరోసా కేంద్రాలను ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. దీనికి తోడు ఏళ్ల తరబడి ఉన్న పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందన్న వాదన వినిపిస్తోంది. క్లస్టర్ వ్యవస్థలో నిర్వహించే విధులే నూతన విధానంలో సైతం ఉండనున్నాయి. కూటమి మార్క్ చూపించుకోవాలన్న ప్రయత్నంలో భాగంగానే ఈ మార్పులు చేస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
విభజన ఈ విధంగా..
పంచాయతీలను నాలుగు గ్రేడ్లుగా విభజించారు. పంచాయతీ కార్యదర్శుల హోదాను పంచాయతీ అభివృద్ధి అధికారి (పీడీఓ)గా మార్చారు. ప్రతి పంచాయతీలో ప్రధానం గా పారిశుధ్యం, తాగునీటి సరఫరా, గ్రామీణ ప్రణాళిక, వీధి దీపాల నిర్వహణ, ఇంజనీరింగ్, ఆదాయం– పన్ను వసూళ్ల విభాగాలు ఉండనున్నాయి. జిల్లాలోని 526 గ్రామ పంచాయతీలను 249 క్లస్టర్లుగా విభజించి ఇప్పటి వరకు పాలన అందించారు.
మార్క్‌కు కూటమి తహతహ
ఇప్పటివరకు పంచాయతీ కార్యదర్శుల పోస్టులు ఐదు గ్రేడ్లుగా ఉండేవి. సచివాలయ ఉద్యోగులు ఆరో గ్రేడ్‌గా ఉండగా వాటిని ప్రస్తుతం మూడు గ్రేడ్లుగా మార్పు చేస్తున్నారు. అయితే ఉద్యోగులకు లాభం కల్పిస్తున్నామని చెబుతూ కూటమి సర్కార్ పాత విధానానికి కొత్త తరహా కలరింగ్ ఇస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటివరకు పంచాయతీల్లో అభివృద్ధి పనులు, పారిశుద్ధ్యం, ఇతర నిర్వహణ పనులు పంచాయతీ సెక్రటరీల పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారు. కొత్తగా సైతం పేరు మార్చి వారికే ఆ బాధ్యతలు అప్పగించారు. కేవలం కూటమి ప్రభుత్వం తన మార్క్ చూపించుకునేందుకు పడుతున్న పాట్లలో భాగంగానే ఈ మార్పులు చేస్తుందన్న భావన కలుగుతోంది.
ఆ గ్రామ పంచాయతీలో 10 వేలకు పైగా జనాభా ఉండి, రూ. కోటికి పైగా ఆదాయం ఉంటే స్పెషల్ గ్రేడ్ పంచాయతీగా పరిగణిస్తారు. జిల్లాలో అమరావతి, అచ్చంపేట, కారంపూడి, క్రోసూరు, పెదకూరపాడు, రెంటచింతల, లింగంగుంట్ల, రావిపాడు, నకరికల్లు, గుండ్లపల్లి, జానపాడు గ్రామ పంచాయతీలను స్పెషల్ గ్రేడ్‌గా ప్రకటించారు. గ్రేడ్–1 కార్యదర్శి స్థాయిని పెంచి డిప్యూటీ ఎంపీడీవోగా నియమిస్తారు. ఇక మిగిలిన గ్రామ పంచాయతీలను గ్రేడ్–1, 2, 3 గా విభిజించారు.
ఇప్పటి వరకు ఉన్న క్లస్టర్ వ్యవస్థలో రెండు పంచాయతీలకు కలిపి ఒక కార్యదర్శి ఉండడంతో వసూళ్లు మందగిస్తున్నాయి. ఒక్కో పంచాయతీని విడదీసి ప్రత్యేక హోదా ఇస్తే, వసూళ్లు బా గుంటాయన్న భావనతోనే ఈ నిర్ణయం తీసు కున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.


