ప్రసన్నాంజనేయస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు
సత్తెనపల్లి: కట్టావారిపాలెం గ్రామంలోని ప్రసన్నాంజనేయ స్వామి 15వ వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్వామి వారికి మూడు రోజుల పాటు జరగనున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా 108 కలశాలతో అభిషేకాలు చేసి అంకురార్పణ చేశారు. సహస్ర దీపాలంకరణ, ఆంజనేయ భక్తసమాజం వారి భజన కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ కమిటీ బాధ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
హరేకృష్ణ గోకుల క్షేత్రంలో లక్ష దీపోత్సవం
తాడేపల్లి రూరల్ : గుంటూరు జిల్లా కొలనుకొండ వద్ద ఉన్న హరేకృష్ణ గోకుల క్షేత్రంలో లక్ష దీపోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు క్షేత్ర అధ్యక్షులు వంశీధర దాస తెలిపారు. శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్తిక మాసాన్ని పురస్కరించుకుని ఈ నెల 15వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు ఉత్సవాలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ప్రతిరోజు అఖండ దీపంతో కార్యక్రమం ప్రారంభమవు తుందన్నారు. భక్తులకు అన్నప్రసాదం ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. లక్ష దీప పూజలో పాల్గొనదలచిన భక్తులు 73992 25533 నెంబర్‌ను సంప్రదించాలని తెలిపారు. అనంతరం లక్ష దీపోత్సవ గోడపత్రికను ఆవిష్కరించారు. గోకుల క్షేత్రం వైస్ ప్రెసిడెంట్ విలాస విగ్రహ దాస, పీఆర్‌వో రఘునాథ దాస పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో ఉచిత వైద్య శిబిరం
గుంటూరు మెడికల్: అంతర్జాతీయ మధుమేహ వ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం గుంటూరు డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో ప్రత్యేక ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఎన్‌సీడీ జిల్లా అధికారి డాక్టర్ రోహిణి రత్నశ్రీ, ఎన్‌సీడీ కన్సల్టెంట్ డాక్టర్ కె.గిరిధర్‌లు వైద్య శిబిరంలో పాల్గొని అగాహన కల్పించారు. డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందికి షుగర్, బీపీ పరీక్షలు చేశారు. తరచూ మూత్ర విసర్జన, దృష్టి లోపం, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే తక్షణమే వైద్యులను సంప్రదించి షుగర్ పరీక్షలు చేయించుకోవాలన్నారు.
అందెశ్రీ రచనలు అజరామరం
తెనాలిటౌన్ : అందె శ్రీ రచనలు అజరామరమని వక్తలు కొనియాడారు. తెనాలి గాంధీనగర్‌లోని ఇస్కఫ్ కార్యాలయంలో శుక్రవారం అభ్యుదయ కళాసమితి, ప్రజానాట్య మండలి సంయుక్త ఆధ్వర్యంలో అందెశ్రీ సంతాప సభ నిర్వహించారు. అందెశ్రీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అందెశ్రీ ప్రతి పాట, పద్యం ఆయన జీవితానికి దర్పణంగా నిలిచాయని ప్రజా నాట్యమండలి జిల్లా అధ్యక్షుడు బొల్లిముంత కృష్ణ కొనియాడారు. ఆయన పాడిన పాటలు జన బాహుళ్యంలో అజరామరంగా నిలిచాయని తెలిపారు. కార్యక్రమంలో సాయి మంగ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు కె.రమేష్‌కుమార్, శ్రీనివాసరెడ్డి, ఓ.మార్కండేయులు, బి.సుధాకర్, రామకృష్ణారెడ్డి, సునీల్, కె.మౌనిక, తదితరులు ఉన్నారు.
ప్రసన్నాంజనేయస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు
ప్రసన్నాంజనేయస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు
ప్రసన్నాంజనేయస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు


