న్యాయవాదిపై హెడ్‌కానిస్టేబుల్ దాడికి యత్నం
విధులు బహిష్కరించి నిరసన తెలిపిన న్యాయవాదులు హెడ్‌కానిస్టేబుల్ పై శాఖాపరమైన చర్యలకు డిమాండ్
సత్తెనపల్లి: న్యాయవాది భాను ప్రకాష్‌పై హెడ్‌కానిస్టేబుల్ దురుసుగా ప్రవర్తించి తీవ్ర పదజాలంతో దుర్భాషలాడటమే కాక చొక్కా కాలర్ పట్టుకుని దాడి చేసేందుకు బహిరంగంగా యత్నించాడంటూ న్యాయవాదులు శుక్రవారం విధులు బహిష్కరించి పట్టణంలోని కోర్టు ప్రాంగణంలో గల న్యాయదేవత విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు చిన్నం మణిబాబు, కార్యదర్శి షేక్ జానీ ఖాజావలి ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ పట్టణంలోని తాలూకా సెంటర్‌లో స్వామి వివేకానంద విగ్రహం ఎదుట ఈ నెల 13న ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ ఉదయ్ చంద్ర అటు నుంచి వస్తున్న న్యాయవాది భాను ప్రకాష్ ను ఆపడంతో ఆయన సమాధానం చెప్పే లోపు న్యాయవాదిని తీవ్ర పదజాలంతో దుర్భాషలాడటమేగాక చొక్కా కాలర్ పట్టుకుని దాడి చేసేందుకు బహిరంగంగా ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఈ ఘటనను భానుప్రకాష్ తన సీనియర్ న్యాయవాది అయిన గుజ్జర్లపూడి మార్కురావుకు తెలియజేయగా ఆయన బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దృష్టికి తీసుకువచ్చి బార్ అసోసియేషన్ నిర్ణయం మేరకు శుక్రవారం న్యాయవాదులు విధులు బహిష్కరించారు. హెడ్ కానిస్టేబుల్ ఉదయ్ చంద్ర పై శాఖాపరమైన, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో న్యాయవాదులు నరిశేటి వేణుగోపాల్, దివ్వెల శ్రీనివాసరావు, బత్తిన శ్రీనివాస్‌బాబు, పీవీఎన్ శాస్త్రి, గోపాలకృష్ణమూర్తి, ఎమ్‌వీ చలపతిరావు, గుజ్జర్లపూడి మార్కురావు, కళ్ళం వీరభాస్కర్ రెడ్డి, కాశిమాల్ మార్క్, న్యాయవాదులు, తదితరులు ఉన్నారు.


