ప్రాణాలు కాలువలో కలుస్తున్నాయి | - | Sakshi
Sakshi News home page

ప్రాణాలు కాలువలో కలుస్తున్నాయి

Nov 15 2025 6:57 AM | Updated on Nov 15 2025 6:57 AM

ప్రాణ

ప్రాణాలు కాలువలో కలుస్తున్నాయి

● గత నాలుగు నెలల్లో 18 మంది బలి ● స్నానాలకు దిగి, సెల్ఫీలకు వెళ్లి మృత్యువాత ● లోతు, ప్రవాహాన్ని అంచనా వేయలేక ● శావల్యాపురం, నకరికల్లు, ముప్పాళ్ల, మాచర్ల మండలాల పరిధిలో అధిక ఘటనలు

ఈ నెల 13న పిడుగురాళ్ల మండలం గుత్తికొండ సమీపంలో అదే గ్రామానికి చెందిన కొత్త శ్రీనివాసరావు(45) నీటి కోసం కాలువలో దిగి మృత్యువాత పడ్డాడు. కుమార్తె తేజస్విని కలసి బిలం ప్రాంతానికి వెళ్లాడు. వంతెన వద్ద నీరు తాగడానికి ప్రమాదవశాత్తు జారి కాలువలో పడిపోయాడు. తండ్రిని కాపాడటానికి కాలువలో దిగిన చిన్నారి తేజస్విని సైతం కాలువలో దిగి కొట్టుకుపోతుండగా స్థానికులు తేజస్వినిని కాపాడారు, తండ్రిని బయటకు తీసేలోపు మరణించాడు.

ఈ నెల 11న శావల్యాపురం మండలం గంటావారిపాలెం సమీపాన అద్దంకి బ్రాంచ్‌ కెనాల్‌లో స్నానానికి దిగిన ఓ మహిళ మృతి చెందారు. వినుకొండ పట్టణానికి చెందిన పఠాన్‌ గౌసియా(34) కెనాల్‌ వద్దకు స్నానానికి వెళ్లారు. నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో గౌసియా అత్త పఠాన్‌ జాన్‌బీ, గౌసియా కొట్టుకుపోగా, పోలీసులు ఏర్పాటు చేసిన తాడుకు చిక్కుకోవడంతో జాన్‌బీ ని స్థానికులు కాపడగా, గౌసియా మాత్రం నీట మునిగి మరణించారు.

ఈ ఏడాది ఫిబ్రవరి 13న ముప్పాళ్ళ మండలంలోని గుంటూరు బ్రాంచి కాలువ లో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. బ్లూ, రెడ్‌, వైట్‌ కలర్‌ గీతలు గల చొక్కా, వయస్సు 30–35 సంవత్సరాల వయసు కలిగిన యువకుడు ఽమృతదేహంను గుర్తించామని ఎస్సై వి.సోమేశ్వరరావు తెలిపారు. జేసీబీ సాయంతో బయటకు తీసి మృతదేహాన్ని బయటకు తీశారు.

ఈ ఏడాది ఆగస్టు 10న సరదాగా ఈతకు వెళ్ళి మృత్యువాత పడ్డ సంఘటన ముప్పాళ్ల మండల కేంద్రంలోని పెదనందిపాడు బ్రాంచి కాలువ వద్ద చోటుచేసుకుంది. అచ్చంపేట మండలం వేల్పూరు గ్రామానికి చెందిన చిలకా సాగర్‌(25) అనే యువకుడు ఆటో నడుపుకుంటూ జీవిస్తున్నాడు. సరదాగా ఈత కొట్టేందుకు కాల్వలో పై వైపు కి దిగాడు. సాగర్‌ నీటి ఉధృతికి కొట్టుకుంటూ వెళ్లి డ్రాపులో పడ్డాడు. గమనించిన స్థానికులు కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ప్రాణాలు కోల్పోయాడు.

ఎన్‌ఎస్పీ కాలువలో ప్రమాదవశాత్తు పడి వరుస మరణాలు

ప్రమాదబారిన పడుతున్న వైనం

సాక్షి, నరసరావుపేట: చిలకలూరిపేటకు చెందిన షేక్‌ అర్షద్‌, బాపట్ల జిల్లా చీరాల మండలం ఆంధ్రకేసరి నగర్‌కు చెందిన దరబడి మార్క్‌ రూఫస్‌, గుండ్లపల్లి గ్రామానికి చెందిన షేక్‌ షమీర్‌వలి, గుత్తి వరుణ్‌లు గుంటూరులోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతున్నారు. దసరా సెలవులకు ఈ ఏడాది సెప్టంబర్‌ 30న గుండ్లపల్లిలోని షమీర్‌ వలి ఇంటికి ముగ్గురు మిత్రులు వచ్చారు. అందరూ కలసి సాగర్‌ కెనాల్‌లో ఈత కొట్టేందుకు బైక్‌లో అర్షద్‌, మార్క్‌లను తీసుకువెళ్లి వదలిన షమీర్‌వలి, మరో స్నేహితుడు వరుణ్‌ను తీసుకురావడానికి గ్రామంలోకి వెళ్లాడు. తిరిగి వచ్చే సరికి స్నేహితులు ఇద్దరు లేకపోవడంతో ఎంత వెతికినా దొరక్కపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. తీవ్ర గాలింపు అనంతరం మరుసటి రోజు శివపురం తండా వద్ద మృతదేహాలను పోలీసుల గుర్తించారు. ఇద్దరు యువకుల భవిష్యత్తు కాలువ పాలైంది. ఆ కుటుంబాల బాధ వర్ణనాతీతం. సరదాగా ఈతకు వెళ్లి ప్రవాహ వేగాన్ని అర్థం చేసుకోలేక మృత్యువాత పడ్డారు. లోతు ఎక్కువ ఉందని తెలిసి కొంతమంది ఈతకు వెళ్లి నీట మునిగి చనిపోతున్నారు. కొంతమంది కాలు జారి, మరికొంతమంది కార్తికమాస పవిత్ర స్నానాలకు వెళ్లి కాలువల్లో పడి మత్యువాత

పడుతున్నారు.

కాలువకు నిండుగా నీరు...

నాగార్జున సాగర్‌ కుడి కాలువకు ఈ ఏడాది జూలై 23వ తేదీన నీరు విడుదల చేసిన తరువాత కాలువల్లో మునిగి ఇప్పటికే 18 మంది మరణించినట్టు సమాచారం. సాగర్‌లో పుష్కలంగా నీరు ఉండటంతో పూర్తి స్థాయిలో కాలువలు గత మూడు నెలలుగా పారుతున్నాయి. ఈత, స్నానానికి, పశువులను ఒడ్డుకు చేర్చే క్రమంలో కాలుజారి ఇలా పలు కారణాలతో కాలువల్లోకి దిగి మృత్యువాత పడుతున్నారు.

ప్రవాహాన్ని అంచనా వేయలేక...

ఎన్‌ఎస్పీ కాలువల్లో నీటి ప్రవాహం చూసి చాలా మంది ఉత్సాహంతో ఈత కొట్టాలని, నీటిలో సెల్ఫీలు దిగాలని ఆశపడతారు. అయితే కాలువ లోతు, నీటి ప్రవాహాన్ని అంచనా వేయడంలో పొరబడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మరికొంతమంది ఆవేశంలో ఆత్మహత్యకు పాల్పడాలన్న ఆలోచనతో కాలువల్లో దూకుతున్నారు. ఇలా కాలువల్లోపడి ప్రమాదవశాత్తు మరణిస్తున్న ఘటనలు ముప్పాళ్ల, శావల్యాపురం, మాచర్ల, దుర్గి, నకరికల్లు, ఈపూరు మండలాల్లో ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి.

ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు...

ప్రాణాలు కాలువలో కలుస్తున్నాయి 1
1/1

ప్రాణాలు కాలువలో కలుస్తున్నాయి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement