సెల్‌ఫోన్ టవర్ ఎక్కి యువకుడి హల్‌చల్
నగదు ఇప్పించాలంటూ ఆందోళన గంటన్నరపాటు ఉత్కంఠ నచ్చచెప్పి దించిన పోలీసులు
ఫిరంగిపురం: తనకు రావాల్సిన నగదు రాక ఎన్నో ఇబ్బందులు పడుతున్నానని, దాన్ని ఇప్పించాలంటూ ఓ యువకుడు 60 అడుగుల సెల్‌ఫోన్ టవర్‌ఎక్కి కూర్చుని హల్‌చల్ చేశాడు. మండల కేంద్రంలోని విజ్ఞాన పురానికి చెందిన వెలిచర్ల భూషణం పెయింటర్‌గా పని చేస్తుంటాడు. అతడికి భార్య, ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగపిల్లవాడు ఉన్నారు. కాగా ఐదేళ్ల కిందట తనకున్న ఇంటిని తాకట్టు పెట్టి స్థానికంగా ఉన్న ఓ వ్యక్తి ద్వారా గుంటూరులోని మరో వ్యక్తికి ఐదు లక్షల నగదు ఇప్పించాడు. అప్పటి నుంచి ప్రతి నెలా వడ్డీ చెల్లిస్తున్నాడు. నగదు ఇప్పటివరకు తిరిగి ఇవ్వక పోవడంతో మనస్తాపానికి గురై పశు వైద్యశాల పక్కనే ఉన్న సెల్‌ఫోన్ టవర్ ఎక్కి కూర్చున్నాడు. న్యాయం చేయకపోతే పైనుండి దూకుతానని చెప్పాడు. విషయం తెలుసుకున్న సీఐ శివరామకృష్ణ, ఎస్‌ఐలు సురేష్, నవీన్, ఏఎస్‌ఐ పి.జాన్‌బాషా, సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. కిందకు దిగిరావాలంటూ పోలీసులు ఎంతో నచ్చచెప్పి చూశారు. ముందు జాగ్రత్తగా 108 వాహనం కూడా అక్కడకు రప్పించారు. కానీ తనకు నగదు చెల్లించాల్సిన గుంటూరుకు చెందిన లోహిత్ రెడ్డిని పిలిపించాలంటూ పట్టుబట్టాడు. దీంతో అతడి కోసం ప్రయత్నించినా ఫోన్ కలవకపోవడంతో యువకుడిని నచ్చచెప్పేందుకు పోలీసులు ప్రయత్నించారు. చివరకు భార్య జ్యోతి, కుమార్తెలు మల్లిక, మహి, కుమారుడు లక్కీలను పిలిపించి వారితో నచ్చచెప్పించారు. దీంతో ఆయువకుడు తనకు న్యాయం చేయాలని అంటూ గంటన్నర తరువాత సెల్ టవర్ దిగివచ్చాడు. సీఐ శివరామకృష్ణ మాట్లాడి వివరాలు నమోదు చేసుకొని, న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు.
సెల్‌ఫోన్ టవర్ ఎక్కి యువకుడి హల్‌చల్


