వీవీఐటీ విశ్వవిద్యాలయానికి ఇస్రో ప్రాజెక్ట్ నిధులు
పెదకాకాని: విశ్వవిద్యాలయాల పరిశోధనా సంస్థలకు అంతరిక్ష శాస్త్రం అనువర్తనాలకు సంబంధించిన పరిశోధనలను ప్రోత్సహించేందుకు ఇస్రో సంస్థ రెస్పాండ్ కార్యక్రమం ద్వారా వీవీఐటీ విశ్వవిద్యాలయానికి నిధులు అందించడానికి ఆమోదం తెలిపినట్లు ప్రో చాన్సలర్ వాసిరెడ్డి మహదేవ్ తెలిపారు. మండలంలోని నంబూరు వీవీఐటీయూలో గురువారం ఆయని వివరాలు తెలిపారు. ఈసీఈ విభాగానికి చెందిన ఎన్. దుర్గారావు ప్రధాన పరిశోధకుడిగా, ఎం.వై. భానుమూర్తి, శేషు చక్రవర్తి సహ పరిశోధకులుగా‘ లో నాయిస్ టైమ్ అండ్ ఫ్రీక్వెన్సీ ట్రాన్ఫర్ యూజింగ్ ఆప్టికల్ మీడియం’ అనే ప్రాజెక్ట్‌ను ఇస్రో బెంగళూరు కేంద్రానికి పంపగా రెస్పాండ్ కార్యక్రమానికి ఎంపికై నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్ట్‌కు ఇస్రో రూ. 20 లక్షలు అందిస్తుందని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆప్టికల్ ఫైబర్ అధారిత వ్యవస్థ ద్వారా దీర్ఘ దూరాలకు తక్కువ శబ్దంతో అధిక స్థిరత్వం కలిగిన ఫ్రీక్వెన్సీ ప్రసార సాంకేతికతను అభివృద్ధి చేయడం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఇందులో విశ్వవిద్యాలయానికి చెందిన అధ్యాపకులు పరిశోధకులుగా ఉండటం ద్వారా విద్యార్థులను భాగ్వస్వామ్యం చేయనున్నట్లు తెలిపారు. ఇస్రో వంటి ప్రతిష్టాత్మక సంస్థ ఆమోదించిన పరిశోధనలలో విద్యార్థులు భాగం కావడం ద్వారా ఉపగ్రహాల తయారీ తదితర అంశాలపై అవగాహన కలుగుతుందని చెప్పారు. అనంతరం ప్రాజెక్ట్ పరిశోధకులుగా ఉన్న అధ్యాపకులను చాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్, వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కొడాలి రాంబాబు, రిజిస్ట్రార్ వై. మల్లికార్జునరెడ్డి, అకడమిక్ డీన్ కె. గిరిబాబు అభినందిచారు.


