విభిన్న పంటల సాగుతో నిరంతర ఆదాయం
నరసరావుపేట రూరల్: ప్రకృతి వ్యవసాయంలో ప్రధాన పంటతోపాటు విభిన్న పంటలను సాగుచేయడం వలన రైతులకు నిరంతరం ఆధాయం సమకూరుతుందని జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ కె.అమలకుమారి తెలిపారు. రైతు సాధికారక సంస్థ, జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ ఆధ్వర్యంలో ఐసీఆర్‌పీల శిక్షణ కార్యక్రమం జిల్లా ప్రకృతి వ్యవసాయ జిల్లా కార్యాలయంలో గురువారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ విధానంలో వరి, మిరప, పత్తి, మొక్కజొన్న, కూరగాయలు వంటి ప్రధాన పంటలతోపాటు పలు అంతర పంటలు వేయడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం సమకూరుతుందని తెలిపారు. దీంతోపాటు భూమి ఆరోగ్యంగా ఉండాలంటే 365 రోజులు పచ్చని పంటలతో భూమిని కప్పి ఉంచాలన్నారు. రైతులు గ్రామంలోనే జీవామృతం, ధ్రవ జీవామృతం, నీమాస్త్రం, అజ్ఞాస్త్రంతోపాటు కషాయాలు తయారు చేసుకోవాలని సూచించారు. వీటిని సకాలంలో వినియోగించడం ద్వారా రసాయన క్రిమిసంహారాల అవసరం లేకుండానే పంటలను కాపాడుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఎన్‌ఎఫ్‌ఏ మల్లేశ్వరి, అదనపు డీపీఎం ప్రేమ్‌రాజ్, జిల్లా ఎన్‌ఎఫ్‌ఏలు సైదయ్య, అప్పలరాజు, నందకుమార్, సౌజన్య, మేరి తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ కె.అమలకుమారి


