
సమన్వయంతో పనిచేస్తే ప్రమాదాల నివారణ
నరసరావుపేట: రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖలైన రెవెన్యూ, రవాణా, ఆర్‌అండ్‌బీ, నేషనల్ హైవేస్, ఆరోగ్య శాఖలు పోలీసు శాఖతో సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు, ఎస్పీ కె.శ్రీనివాసరావు సూచించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో ‘డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ’ సమావేశానికి కలెక్టర్ చైర్మన్ హోదాలో హాజరై, ప్రమాదాల నివారణకు పలు సూచనలు చేశారు. గుర్తించిన బ్లాక్ స్పాట్లలో సంబంధిత డిపార్టుమెంట్ అధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలని సూచించారు. ద్విచక్ర వాహనాలు నడిపేవారు ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నారని, ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేసేవారిపై కఠినంగా వ్యవహరించాలని, ద్విచక్ర వాహనాలు నడిపే వారు హెల్మెట్ తప్పనిసరిగా ధరించేలా చూడాలని కోరారు. యూ టర్న్ దగ్గర సైన్ బోర్డులు, రేడియం స్టిక్కర్లు పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. రొంపిచర్ల వద్ద హైవేపై ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని అక్కడ ప్లైఓవర్ నిర్మాణానికి అవకాశాలను పరిశీలించాలని ఇంజినీరింగ్ అధికారులను జిల్లా కలెక్టర్ కోరారు. అనంతరం నోడల్ అధికారి ఈ–డార్ యాప్ పై అవగాహన కల్పించారు. ఆర్టీఓ వి.సంజీవ కుమార్, ఆర్‌అండ్‌బీ ఈఈ, ఆర్టీసీ ఆర్.ఎం, నేషనల్ హైవే అధికారులు పాల్గొన్నారు.
గంజాయి హాట్‌స్పాట్లపై నిఘా పెట్టండి..
నరసరావుపేట: జిల్లావ్యాప్తంగా గుర్తించిన గంజాయి హాట్‌స్పాట్‌లపై పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేయాలని, మాదక ద్రవ్యాల కార్యకలాపాల్లో ఉన్న అనుమానితుల నివాస ప్రాంతాలను అధికారులు తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు, జిల్లా ఎస్పీ కె.శ్రీనివాసరావు ఆదేశించారు. మంగళవారం తన కార్యాలయంలో జిల్లా మాదక ద్రవ్యాల నిరోధక సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్, ఎస్పీ మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో అసంపూర్తిగా నిర్మించిన భవనాలు, ఖాళీగా వదిలివేసిన భవనాలలో కార్యకలాపాలపై నిఘా ఉంచాలన్నారు. ఎన్‌డీపీఎస్ చట్టం కింద ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదై, గంజాయి సరఫరా చేస్తూ, అమ్ముతూ దొరికిన వారి ఆస్తులు జప్తు చేస్తామన్నారు. మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించేందుకు స్కూళ్లస్థాయి నుంచి విశ్వవిద్యాలయాల వరకు అన్ని విద్యా సంస్థలలో ఈగిల్ క్లబ్‌లను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. డీ–అడిక్షన్ సెంటర్లు పునరావాస సహాయం కోసం అవుట్‌రీచ్ ప్రణాళికలను సిద్ధం చేయాలన్నారు. అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ కలువ రవీంద్ర, డీఎంహెచ్‌ఓ డాక్టర్ రవి, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ ఎం.ప్రసూన, సైకియాట్రిస్ట్ డీజీపీఎస్ రాజు, జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమాధికారి ఎం.ఉమాదేవి, డీపీఓ ఎస్‌వి.నాగేశ్వర నాయక్, డీసీజీఎస్‌డబ్ల్యూఎస్ ఏపీ గోపిరెడ్డి, జిల్లా డ్రగ్ ఇన్‌స్పెక్టర్ సునీత తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు
జిల్లా ఎస్పీతో కలిసి డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశం నిర్వహణ