అవినీతి దూర విద్య | - | Sakshi
Sakshi News home page

అవినీతి దూర విద్య

Jul 31 2025 8:26 AM | Updated on Jul 31 2025 8:26 AM

అవినీతి దూర విద్య

అవినీతి దూర విద్య

సాక్షి ప్రతినిధి, గుంటూరు: కాపీయింగ్‌ చేసే విద్యార్థికి ఒక రేటు, పరీక్షలను వేరే వారితో రాయిస్తే ఒక రేటు అంటూ ఏఎన్‌యూ దూర విద్యా పరీక్షల్లో ప్రత్యేక తనిఖీ బృందాలు పెద్దఎత్తున దండుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇద్దరు సభ్యులతో జిల్లాల వారీగా తనిఖీ బృందాలను యూనివర్సిటీ నియమించింది. జూలై 10న ప్రారంభమైన దూర విద్య పరీక్షల్లో మొదటి విడత కేవలం పరీక్ష కేంద్రానికి పరిశీలకులను మాత్రమే నియమించాలి. కాంట్రాక్టు అధ్యాపకులే అబ్జర్వర్లుగా డబ్బులు దండుకోవాలా అంటూ పర్మినెంట్‌ అయిన తమను ఎందుకు తనిఖీ బృందాలుగా నియమించలేదంటూ కొందరు ఆచార్యులు యూనివర్సిటీ ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో వీరిని రెండో దఫాలో ప్రత్యేక తనిఖీ బృందాలుగా నియమించేలా ఆదేశాలు తెచ్చుకున్నారు.

మూడో విడత పరీక్షలు ప్రారంభం

దూరవిద్యలో మూడో విడత పరీక్షలు 30వ తేదీ నుంచి మొదలయ్యాయి. పరీక్షలు ఉదయం తొమ్మిది గంటల నుంచి 12 గంటల వరకూ జరిగితే, మధ్యాహ్నం ఒంటిగంటకు యూనివర్సిటీలోని ఒక ఆచార్యుడు తనిఖీ బృందం అంటూ రెండు సెంటర్లలో హడావుడి చేశారు. తాము ముగ్గురం వచ్చామంటూ రు.60 వేల ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దీనిపై నిర్వాహకులు యూనివర్సిటీకి ఫిర్యాదు చేశారు. అయితే, అధికారులు స్పందించలేదని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురువారం తిరుపతి, చిత్తూరు జిల్లాలలో తనిఖీలకు వస్తానని.. నిర్వాహకులు తన సంగతి చూసుకోవాలని ముందుగానే వర్తమానం పంపినట్లు సమాచారం. దొడ్డిదారిన ఉద్యోగం పొందిన ఈయన ఒక ఎమ్మెల్యేకి క్లాస్‌మేట్‌నని, ప్రకాశం జిల్లాలోని ఎమ్మెల్యేకి దగ్గర బంధువునంటూ హల్‌చల్‌ చేస్తున్నాడు. బీఈడీ పరీక్షల వివాదంలో అతనిపై చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు వచ్చినా పలుకుబడితో కొనసాగుతున్న ఆ ఆచార్యుడి అరాచకాలు అన్నీ ఇన్నీ కావు.

మనకబారుతున్న ఏఎన్‌యూ ప్రతిష్ట దూర విద్య కేంద్రాల్లో ప్రత్యేక తనిఖీ బృందాల పేరుతో దోపిడీ

లాడ్జిలో పంచాయితీ

రాయలసీమ జిల్లాల్లో ఒకే ప్రాంతంలో 30 మంది విద్యార్థుల జవాబు పత్రాలను సీజ్‌ చేసి లాడ్జిలో పంచాయితీ పెట్టారు. వారు అడిగిన మొత్తం చెల్లించకపోవడంతో సెంటర్‌ను రద్దు చేయించారు.

కోనసీమలో ఒక అతిథి అధ్యాపకుడు రూ.2 లక్షలు, తనిఖీ బృందాల పేరిట మరో రూ.50 వేలు వసూలు చేసినట్లు సమాచారం. దీనిపై అక్కడ సోషల్‌ మీడియాలో పోస్టులు కూడా వచ్చాయి. ఒక తనిఖీ బృందంలోని ఒక ఆచార్యుడు ఒక సెంటర్‌లో ఒక్కో విద్యార్థి నుంచి వెయ్యి రూపాయల చొప్పున వసూలు చేసినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement