
అటవీ జంతువుల రక్షణ మన బాధ్యత
జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు
నరసరావుపేట: వన్య ప్రాణులు మానవ హితులని, వాటిని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపైనా ఉందని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు పేర్కొన్నారు. ప్రపంచ పాముల దినోత్సవం (జూలై 16), అంతర్జాతీయ పులుల దినోత్సవం (జూలై 29) నేపథ్యంలో బుధవారం కలెక్టరేట్‌లోని వన్య మృగ సంరక్షణ వర్క్‌షాప్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ సహజంగా పాములు, పులుల వంటి జీవరాశులు అంటే ప్రజల్లో భయం ఉంటుందన్నారు. ఆ భయంతో వాటిని వేటాడటం, చంపడం జరుగుతుందన్నారు. వాస్తవానికి వన్యప్రాణులు కేవలం భయంతో మాత్రమే మనుషులపై దాడి చేస్తాయన్నారు. పర్యావరణంలో వివిధ రకాల ఆహార చక్రాలలో వన్యప్రాణులు భాగస్వాములై పర్యావరణానికి, మానవాళికి మంచి చేస్తాయని గుర్తుచేశారు. రైతులు ప్రమాదకర సర్పాలు, విషంలేని సర్పాల గురించి అవగాహన పెంచుకోవాలన్నారు. వర్క్‌షాప్‌లో నిజమైన సర్పాలతో ఏర్పాటు చేసిన లైవ్‌షో వీక్షకులను ఆకట్టుకుంది. వర్క్ షాప్ నిర్వహించిన అటవీశాఖ అధికారులను ఎమ్మెల్మే చదలవాడ అభినందించారు. ఈ సందర్భంగా జీవ వైవిధ్యాన్ని కాపాడటంలో పులి ఆవశ్యకత గురించి తెలియజేస్తూ పోస్టర్ విడుదల చేశారు. వర్క్ షాపులో ఎస్పీ శ్రీనివాసరావు, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, జిల్లా అటవీ అధికారి కృష్ణప్రియ పాల్గొన్నారు.