
ఉద్యోగుల ప్రయోజనాలు సాధించేందుకు రాజీపడం
గుంటూరు మెడికల్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ప్రయోజనాలను సాధించేందుకు ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడబోమని ఏపీ ఎన్జీజీవో రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్ అన్నారు. మంగళవారం గుంటూరులో గుంటూరు వైద్య కళాశాల ఎదురుగా ఉన్న ఏపీ ఎన్జీజీవో సంఘ సాంస్కృతిక సమావేశ భవనాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా విద్యా సాగర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన జీపీఎఫ్, ఏపీ జీఎల్‌ఐ, సరండర్ లీవ్ బకాయిలు కొంత మేరకు కూటమి ప్రభుత్వం చెల్లించిందన్నారు. మిగిలిన వాటిని చెల్లించేందుకు రాష్ట్ర నాయకులతో కృషి చేస్తుందని తెలిపారు. గుంటూరులో ఎన్జీవో ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దారని అభినందించారు. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కూడా ఎన్జీవో ప్రాంగణాలను ఉద్యోగులకు ఉపయోగపడేలా తీర్చిదిద్దాలన్నారు. రాష్ట్రంలోని మిగతా జిల్లాలకు గుంటూరు జిల్లా మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు.
ఏపీ ఎన్జీజీవో ప్రధాన కార్యదర్శి డి.వి.రమణ మాట్లాడుతూ ఉద్యోగ నాయకుల సమష్టి కృషితో ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు సాధించుకుంటామన్నారు. జిల్లా అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి శ్యామ్‌సుందర్ శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్ నాగూర్ షరీఫ్, రాష్ట్ర నాయకులు సుబ్బారెడ్డి, రామ్‌ప్రసాద్, రంజిత్‌నాయుడు, తదితరులు మాట్లాడారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ అహ్మద్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ సమక్షంలో నూతన సాంస్కృతిక భవనాన్ని ప్రారంభించారు. సంఘ గుంటూరు నగర అధ్యక్షుడు సూరి, కార్యదర్శి కళ్యాణ్‌కుమార్, సంఘ నేతలు సత్యనారాయణరెడ్డి, శరత్‌బాబు, కృష్ణారెడ్డి, రామకృష్ణ, రాంబాబు, జానీబాషా, వెంకటరెడ్డి, నాగేశ్వరరావు, సుకుమార్, శ్రీవాణి పాల్గొన్నారు.