
మళ్లీ ప‘రేషన్’
కుయ్ కుయ్ అంటూ ఇంటి వద్దకు వచ్చి రేషన్ సరుకులు అందించే ఎండీయూ వాహనాల సైరన్ ఇక మూగబోయింది. అమ్మా.. మీ ఇంటికి రేషన్ వచ్చింది.. రండి అని ఆప్యాయంగా పిలిచే ఆపరేటర్లను ప్రభుత్వం ఇంటికి పంపుతోంది. ఇకపై సంచులు పట్టుకొని రేషన్ దుకాణాల చుట్టూ తిరగండంటూ కూటమి ప్రభుత్వం ప్రజలకు తిప్పలు తీసుకొచ్చింది.
నరసరావుపేట టౌన్ : పేదల ఇళ్ల వద్దకే నిత్యావసర సరుకులను చేరుస్తున్న మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ (ఎండీయూ) వాహనాల సేవలకు ప్రభుత్వం మంగళం పాడింది. ఇకపై రేషన్ కార్డుదారులు పనులు మానుకుని, తమ ఇళ్లకు దూరంగా ఉన్న రేషన్ షాపుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు కల్పించారు. దీంతో పాటు పేదల బియ్యం నల్ల బజారుకు యథేచ్ఛగా తరలి వెళ్లనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీకి చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు రేషన్ డీలర్‌షిప్‌లను హస్తగతం చేసుకున్నారు. ఇప్పటికే ఎండీయూ వాహనాల ద్వారా కొంత మందికి పంపిణీ చేసి మిగిలినవి అక్రమంగా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇక ఎండీయూ వాహనాలు తొలగించి పంపిణీ వ్యవస్థ పూర్తిగా డీలర్ల చేతికి అప్పగిస్తుండడంతో పేదల బియ్యం పక్కదారి పట్టడం ఖాయమనే చెప్పవచ్చు.
రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఎండీయూ వాహనాలు తొలగించి రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసరాలు అందించనున్నట్లు మంగళవారం ప్రకటించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయంలో ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ కార్డుదారుల ఇంటి వద్దకే నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఐదేళ్లపాటు ఇంటి వద్దకే రేషన్ సరుకుల పంపిణీ సక్రమంగా సాగింది. ఇప్పుడు ఈ వ్యవస్థను నిలిపి వేసేందుకు కూటమి ప్రభుత్వం కుయుక్తులు పన్నింది. ఎండీయూ వాహనాలను నిలిపి వేస్తే పల్నాడు జిల్లాలో 1289 రేషన్ దుకాణాలు ఉన్నాయి. ప్రతి నెలా 402 ఎండీయూ వాహనాల ద్వారా సుమారు 6,34,893 మంది రేషన్ కార్డుదారులకు నిత్యావసరాలు అందజేస్తున్నారు. ఇకనుంచి కార్డు దారులకు తిప్పలు తప్పవనే అనుకోవాలి.
2027 వరకు అగ్రిమెంట్ ఉన్నప్పటికీ..
రేషన్ దుకాణాల వద్ద పేదలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ సరుకుల పంపిణీకి శ్రీకారం చుట్టారు. దీంతో ప్రతినెలా లబ్ధిదారుల ఇంటి వద్దనే నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. వాహనం ఏ వీధికి వస్తుందో ముందుగానే తెలియజేయడంతో లబ్ధిదారులు ఇంటి వద్ద ఉండి రేషన్ సరుకులు తీసుకునేవారు. దివ్యాంగులు, వృద్ధులు, మహిళలకు ఈ విధానం సౌకర్యవంతంగా ఉండేది. గత ప్రభుత్వం చేసుకున్న అగ్రిమెంట్ మేరకు 2027 జనవరి వరకు కొనసాగాల్సి ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం వాహనాలను తొలగించింది.
ఎండీయూ వాహనాలకు మంగళం రేషన్ సరుకులు డీలర్‌లతో పంపిణీ ఇంటింటి రేషన్ పంపిణీని నిలిపిన కూటమి ప్రభుత్వం ఆందోళనలో కార్డుదారులు, ఎండీయూ వాహనదారులు