
బర్లీ పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలి
నల్లమడ రైతు సంఘం కన్వీనర్ డాక్టర్ కొల్లా రాజమోహనరావు
చిలకలూరిపేట: బర్లీ పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించి రైతులను ప్రభుత్వం ఆదుకోవాల్సిన ఆవశ్యకత ఉందని నల్లమడ రైతు సంఘం కన్వీనర్ డాక్టర్ కొల్లా రాజమోహనరావు అన్నారు. బర్లీ పొగాకు ధరకు సంబంధించి ఈనెల 27న ఐటీసీ కంపెనీ ముందు నిర్వహించనున్న కౌలు రైతుల దీక్షపై పట్టణంలోని పండరీపురంలో ఉన్న ఏలూరు సిద్ధయ్య విజ్ఞాన భవన్‌లో మంగళవారం రైతు సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పొగాకు కొనుగోలు సమస్య తీవ్రంగా ఉన్న నేపథ్యంలో బర్లీ పొగాకును కేంద్ర ప్రభుత్వం పొగాకు బోర్డు పరిధిలోకి తీసుకురావాలన్నారు. అమెరికా, యూరప్ వంటి దేశాలలో సిగరెట్ల తయారీలో ఘాటు వాసన కోసం నల్ల బర్లీ పొగాకు ఉపయోగిస్తారని చెప్పారు. అయితే పొగాకు కంపెనీలు సిండికేట్‌గా ఏర్పడి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బర్లీ పొగాకును తక్కువ ధరకు కొంటూ రైతులను నష్టపరుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా స్థానిక రైతులు ఉత్తర భారత రైతు ఉద్యమాలను ఆదర్శంగా తీసుకొని పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై రాధాకృష్ణ మాట్లాడుతూ పొగాకు కొనుగోలులో పెద్దన్న పాత్ర పోషిస్తున్న ఐటీసీ కంపెనీతోపాటు అన్ని కంపెనీలు రైతుల వద్ద ఉన్న పొగాకును కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ సీజన్ ప్రారంభం కావస్తున్నా నేటి వరకు రైతుల వద్ద పొగాకును కంపెనీలు కొనుగోలు చేయకపోవడం దారుణమన్నారు. వ్యవసాయశాఖ వద్ద ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్ల ఎక్కువ మంది రైతులు బర్లీ పొగాకును సాగు చేసి నష్టపోయి ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి నెలకొందన్నారు. ముఖ్యమంత్రితోపాటు వ్యవసాయ మంత్రి సైతం కంపెనీల చేత పొగాకు కొనిపిస్తామని ఇచ్చిన హామీ కేవలం మాటలకే పరిమితమైందని అన్నారు. ఇప్పటికై నా గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో సీపీఐ ఏరియా కార్యదర్శి తాళ్లూరి బాబురావు, సీఐటీయూ మండల కార్యదర్శి పేరుబోయిన వెంకటేశ్వర్లు, మహిళా సమాఖ్య ఏరియా కార్యదర్శి చెరుకుపల్లి నిర్మల, వ్యవసాయ కార్మి క సంఘం అధ్యక్షుడు సాతులూరి లూధర్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ సుభాని, పలు సంఘాల నాయకులు పలువురు పాల్గొన్నారు.