
బ్యాంకర్లు ఉదారంగా రుణాలు మంజూరు చేయాలి
నరసరావుపేట: బ్యాంకర్లు ఉదారంగా లబ్ధిదారులకు రుణాలు మంజూరుచేయాలని పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయులు, జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు బ్యాంక్ అధికారులను కోరారు. మంగళవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో ఈ ఏడాది జనవరి నుంచి మార్చి త్రైమాసికానికి సంబంధించి డీసీసీ(డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటి), డీఎల్‌ఆర్‌సీ (డిస్ట్రిక్ట్ లెవెల్ రివ్యూ కమిటీ)పై బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ మండల స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసి లబ్ధిదారులకు పథకాలపై అవగాహన కల్పించాలన్నారు. పీఎంజేజేవై, పీఎం జనధన్ యోజన వంటి పథకాలలో ఎన్ని యాక్టివ్‌గా ఉన్నాయనే దానిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ త్రైమాసికానికి జిల్లాలోని 310 బ్యాంకులలో సుమారుగా మార్చి చివరి నాటికి రూ.41,995.38 కోట్లు వ్యాపారం జరిగిందని లీడ్ బ్యాంక్ మేనేజరు రాంప్రసాద్ వివరించారు. ప్రధానమంత్రి జనధన్ యోజన కింద 5,31,755 మందికి రూపే కార్డులు మంజూరు చేశామన్నారు. వార్షిక క్రెడిట్ ప్లాన్ క్రింద రూ.22910.84 కోట్ల ఇవ్వడం జరిగిందన్నారు. షార్ట్ టర్మ్ క్రాప్ ప్రొడక్షన్ కింద 8,30,687 మందికి రూ.10,683.56 కోట్లు ఇచ్చామని చెప్పారు. కౌలు రైతులు 3388 మందికి రూ.23.89కోట్లు మంజూరు చేశామని తెలిపారు. ఉన్నత చదువులకై 2024–25లో 1478 అకౌంట్‌దారులకు రూ.71.49కోట్ల రుణాలు మంజూరు చేశామన్నారు. యూనియన్ బ్యాంక్ రీజినల్ హెడ్ టి.మాధురి తొలుత సమావేశం ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ రాంప్రసాద్ త్రైమాసిక నివేదికను వివరించారు. ఆర్‌బీఐ అధికారి అభిషేక్‌రాజ్, నాబార్డు డీడీఎంసీ శరత్‌బాబు, వివిధ బ్యాంకుల కో–ఆర్డినేటర్లు, బ్యాంక్ మేనేజర్లు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదాలు 50 శాతం తగ్గించాలి
నరసరావుపేట: జిల్లాలో రోడ్డు ప్రమాదాలను 50 శాతం తగ్గించాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం ఎస్పీ కంచి శ్రీనివాసరావుతో కలిసి జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశం, మాదక ద్రవ్యాల నిరోధక సమన్వయ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ 2023–2024లో జిల్లాలో వరుసగా 576, 612 రోడ్డు ప్రమాదాలు జరిగాయని, 2025లో ఏప్రిల్ నాటికి 263 ప్రమాదాలు జరిగాయన్నారు. 2024లో రోడ్డు ప్రమాదాలలో 380 మంది మృతిచెందగా, 2025లో నాలుగు నెలల కాలంలో 152 మరణాలు సంభవించాయన్నారు. జిల్లాలోని 34 బ్లాక్ స్పాట్లలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, రోడ్డు ప్రమాదాల సరళిని మెరుగ్గా అంచనా వేయడంలో తోడ్పడుతున్నాయన్నారు. డ్రైవింగ్ శిక్షణకు అనుమతి మంజూరుచేస్తూ రోడ్డుసేఫ్టీ నిర్వాహకులు దుర్గాపద్మజకు సర్టిఫికెట్ అందజేశారు. ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ షాపుల్లో డ్రగ్స్ అమ్మకాలను నిరోధించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా అటవీ అధికారి కృష్ణప్రియ, రోడ్లు, భవనాలశాఖ ఎస్‌ఈ రాజానాయక్, జిల్లారవాణా అధికారి సంజీవ్ కుమార్, డీఎంహెచ్‌వో డాక్టర్ రవి, డీఈవో చంద్రకళ పాల్గొన్నారు.
ఎంపీ లావు, కలెక్టర్ అరుణ్‌బాబు