
సాక్షి టీవీ జిల్లా ప్రతినిధిపై దాడిచేసిన వారిని అరెస్టు
నరసరావుపేట: సాక్షి మీడియా గుంటూరు జిల్లా ప్రతినిఽధి అశోక్‌వర్ధన్‌పై దాడిచేసిన వారిని వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని పలు యూనియన్ల జర్నలిస్టులు డిమాండ్ చేశారు. సోమవారం సాక్షి ఎలక్ట్రానిక్ మీడియా ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రతినిధి అశోక్ వర్ధన్‌పై కారెంపూడిలో టీడీపీ గుండాల దాడిని నిరసిస్తూ మంగళవారం సాయంత్రం పల్నాడు జిల్లా ప్రెస్‌క్లబ్, వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్, యూట్యూబర్ అసోసియేషన్‌లకు చెందిన జర్నలిస్టుల ప్రతినిధులు కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు. ఈ మేరకు కలెక్టర్, ఎస్పీ కార్యాలయాల్లో వినతిపత్రం అందజేశారు. జర్నలిస్టుల యూనియన్‌ల ప్రతినిధులు బి.ప్రసాదు, నంద్యాల జగన్‌మోహన్‌రెడ్డి, సీహెచ్.వి.రమణారెడ్డి, అనీల్‌కుమార్, కె.నాగమణి మాట్లాడారు. ఉద్యోగ నిర్వహణలో భాగంగా అక్కడ జరుగుతున్న సంఘటనలను ప్రపంచానికి తెలియచేసేందుకు వెళ్లిన సాక్షి ప్రతినిధిపై టీడీపీ గుండాలు దాడిచేయటం ప్రభుత్వ అసమర్ధతకు నిదర్శనమన్నారు. వెంటనే దాడిచేసిన వారిపై కేసు నమోదుచేసి అరెస్టుచేయాలని డిమాండ్ చేశారు. ఇటువంటి పోకడలు ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిదికాదని పేర్కొన్నారు. రాజకీయంగా ఏదైనా ఉంటే పార్టీ నాయకులు, కార్యకర్తలు చూసుకోవాలే కాని ఉద్యోగ నిర్వహణలో ఉన్న మీడియా ప్రతినిధులపై దాడులు మంచిది కాదని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కలుగచేసుకొని ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. కార్యక్రమంలో సాక్షి స్టాఫ్ రిపోర్టర్ లవకుమార్‌రెడ్డి, పి.కోటిరెడ్డి, జి.సాంబశివారెడ్డి, గురజాల రిపోర్టర్ మల్లికార్జునరెడ్డి, సాక్షి మీడియా రిపోర్టర్ సుంకిరెడ్డి, నాగరాజు, షేక్ షాహిద్, షేక్ జిలాని, స్వామి, చలమయ్య, రాముడు పలువురు యూట్యూబర్లు పాల్గొన్నారు.