మే 10న జాతీయ లోక్ అదాలత్
సత్తెనపల్లి: ఏపీ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ గుంటూరు వారి ఆదేశాల మేరకు మే 10న మండల న్యాయ సేవా కమిటీ సత్తెనపల్లి ఆధ్వర్యంలో సత్తెనపల్లిలోని అన్ని కోర్టుల్లో జాతీయ లోక్‌అదాలత్ జరుగుతుందని సత్తెనపల్లి మండల న్యాయ సేవాధికార కమిటీ చైర్మన్, సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) వి.విజయ్‌కుమార్‌రెడ్డి బుధవారం తెలిపారు. ఈ లోక్‌అదాలత్‌లో సివిల్ తగాదాలు, రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, మనోవర్తి, చెక్కుబౌన్స్, రెవెన్యూ, బ్యాంకు, ప్రీలిటిగేషన్ కేసులు పరిష్కారమవుతాయన్నారు. జాతీయ లోక్ అదాలత్ ద్వారా సత్తెనపల్లి కోర్టులలో పెండింగ్ ఉన్న వారి కేసులను రాజీ చేసుకోవాలని, ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు.
‘పాక్ జలసంధి’ ఈతయాత్ర పరిశీలకుడిగా సురేష్
నరసరావుపేట ఈస్ట్: భారత్ నుంచి శ్రీలంక వరకు ఈనెల 10వ తేదీన ప్రారంభం కానున్న సాహసోపేతమైన ఈత యాత్రకు పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణానికి చెందిన స్విమ్మింగ్ కోచ్ జి.సురేష్‌ను పరిశీలకుడిగా నియమిస్తూ భారత స్విమ్మింగ్ ఫెడరేషన్ ఉత్తర్వులు జారీ చేసింది. తమిళనాడులోని ధనుష్కోటి నుంచి శ్రీలంకలోని తలైమన్నార్‌ను కలిపే పాక్ జలసంధి గుండా సాగే 29 కిలోమీటర్ల ఈత యాత్రలో 10 మంది స్విమ్మర్లు పాల్గొంటారని సురేష్ తెలిపారు. ఈమేరకు రెండు దేశాల నుంచి అవసరమైన అన్ని అనుమతులు తీసుకున్నట్టు వివరించారు. రెండు దేశాలను కలుపుతున్న పాక్ జలసంధి దాటడం కఠినతరమైన యాత్రగా పేర్కొన్నారు. ధనుష్కోటి వద్ద హిందూ మహాసముద్రం, అరేబియా, బంగాళాఖాతం కలుస్తుండటంతో బలమైన అలలు, అంతర్ ప్రవాహాలు అధికంగా ఉంటాయన్నారు. కాగా, సురేష్‌ను ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, ఏపీ స్విమ్మింగ్ అసోసియేషన్ కార్యదర్శి ఎ.మోహన వెంకట్రావు, పల్నాడు జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ కార్యదర్శి వై.వి.సుబ్బారెడ్డి, శ్రీసుబ్బరాయ అండ్ నారాయణ కళాశాల స్విమ్మింగ్ పూల్ యాజమాన్యం, పలువురు స్విమ్మర్లు అభినందించారు.
నేటి నుంచి బ్రహ్మోత్సవాలు
మాచర్ల: పల్నాడు ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన మాచర్ల శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం రాత్రి 7గంటలకు అంకురార్పణ పూజలతో ప్రారంభం కానున్నాయి. 11వ తేదీ శుక్రవారం ఉదయం 10గంటలకు పౌర్ణమి, 12న కల్యాణ మహోత్సవం, 13వ తేదీ రాత్రి 10గంటలకు హనుమత్‌వాహనం, 14న శేషవాహనం, 15న గరుడవాహనం, 16వ తేదీ రాత్రి 12గంటలకు రవిపొన్నవాహనం, 17న రథోత్సవం, 18న అశ్వవాహనం, 19న సుఖ వాహనం, 20న పుష్పయాగం, సోమవారం రాత్రి ద్వాదశ ప్రదక్షిణలు, 22న ఏక స్థితి కలశ స్థాపన, 23న పవళింపు సేవతో పదహారు రోజుల పండుగతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని ఈఓ ఎం పూర్ణచంద్రరావు, అర్చకులు కొండవీటి రాజగోపాలచార్యులు బుధవారం తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా గురజాల డీఎస్పీ జగదీష్, పట్టణ సీఐ ప్రభాకర్‌రావుల ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
అభయాంజనేయ స్వామి ఆలయానికి విరాళం
పర్చూరు(చినగంజాం): పర్చూరులో వేంచేసియున్న అభయాంజనేయ స్వామి దేవస్థానం ప్రాంగణంలో గది నిర్మాణం కోసం దాతలు రూ. 5,25,116 విరాళంగా అందజేశారు. దేవరపల్లి గ్రామానికి చెందిన రావి రంగనాథ బాబు, నాగవర్ధని దంపతులు తమ కుమారుడు రావి శ్రీధర్ జ్ఞాపకార్థం బుధవారం కమిటీ సభ్యులకు ఈ విరాళాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కోట హరిబాబు, కటారి సురేంద్రబాబు, రంగిశెట్టి ఆంజనేయులు, తులసి శివనాగేశ్వరరావు, కృష్ణంశెట్టి శ్రీనివాసరావు, నర్రా రామయ్య, రంగిశెట్టి రామాంజనేయులు, మంగళగిరి కోటేశ్వరరావు, ఒగ్గిశెట్టి నరసింహారావు, దాసరి సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.
మే 10న జాతీయ లోక్ అదాలత్


