నరసరావుపేట టౌన్: జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేలంలో అక్రమాలపై ‘సర్కారు వారి పాట’ శీర్షికన ప్రచురితమైన కథనానికి స్పందన వచ్చింది. అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన 3391.55 క్వింటాళ్లకు పైగా పీడీఎస్ బియ్యాన్ని గతంలో వేలం నిర్వహించగా కిలో రూ. 32.50 పైసలకు ఓ పాటదారుడు దక్కించుకున్నారు. అనంతరం అతడు పూర్తిగా డబ్బు చెల్లించకపోవడంతో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు గుట్టుచప్పుడు కాకుండా ఈ నెల 7న తిరిగి వేలం నిర్వహించారు. ఇందులో ఐదుగురు మాత్రమే పాల్గొన్నారు. నకరికల్లు గ్రామానికి చెందిన రేషన్ బియ్యం అక్రమ వ్యాపారి తెర వెనుక చక్రం తిప్పాడు. కిలో రూ.22.50 ధర నిర్ణయించి కూటమి నేతలకు అధికారులు అప్పగించారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి సుమారు రూ.35 లక్షలు గండి పడింది. ఈ వ్యవహారంపై సాక్షి దినపత్రికలో ఈనెల 14న కథనం వెలువడటంతో జిల్లా పౌరసరఫరా శాఖ అధికారులు దిద్దుబాటు చర్యలకు దిగారు. ఈ నెలలో ప్రకటించిన వేలంలో 3391.55 క్వింటాళ్లకు గాను 1519.40 క్వింటాళ్లకు సరైన ధర రాలేదని, ఈ నెల 29న తిరిగి మరో మారు నిర్వహించబోతున్నామని తాజాగా ప్రకటన ఇచ్చారు. ఈ వేలంలో పాల్గొనదలచిన వారికి ఉండాల్సిన అర్హతలను అందులో పేర్కొన్నారు. ముందుగా రూ.లక్ష ధరావతు చెల్లించాలని, మిల్లులకు సంబంధించి లైసెన్సు ఉండాలని తెలిపారు. పాటలో పాల్గొనే వారిపై 6–ఏ కేసులు ఉండరాదని డీఎస్‌వో నారదముని పేర్కొన్నారు.
పట్టుబడిన పీడీఎస్ బియ్యంలో సగం సరుకుకు సరైన ధర రాలేదంట ! 29న మళ్లీ వేలానికి ప్రకటన ఇచ్చిన జిల్లా అధికారులు