రిటైర్డ్ సూపరింటెండెంట్‌పై విచారణ వాయిదా
అరసవల్లి:జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో పలు రకాలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ విధుల నుంచి గతేడాది సస్పెండైన రిటైర్డ్ సూపరింటెండెంట్ భాస్కర్‌కుమార్‌పై విచారణ ప్రస్తుతానికి వాయిదా పడింది. జిల్లాలో ఏఎన్‌ఎంల బదిలీల అక్రమాలతో పాటు నకిలీ ఉద్యోగ నియామక పత్రాల జారీ, ఉద్యోగాలిప్పిస్తామంటూ అక్రమ వసూళ్లు తదితర ఆరోపణల కారణంగా ఈయనపై సస్పెన్షన్ అనంతర విచారణ చేపట్టాల్సిందిగా జిల్లా కలెక్టర్ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. శనివారం ఉదయమే ఈ విచారణ జరగాల్సి ఉండగా.. అనివార్య కారణాలతో వాయిదా వేస్తున్నట్లుగా అధికారులు ప్రకటించారు. ఇదిలావుంటే సూపరింటెండెంట్ భాస్కరకుమార్‌ను పైఆరోపణల కారణంగా గత ఏడాది ఆగష్టు 2న విధుల నుంచి సస్పెండ్ చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశించిన నేపథ్యంలో వైద్యశాఖ రీజనల్ డైరక్టర్ నుంచి సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ అయిన సంగతి తెలిసిందే. అయితే ఎంతో కీలకమైన ఈ విచారణ జరగకుండా ఉండేలా జిల్లా వైద్యశాఖకు చెందిన కీలకాధికారులు తీవ్ర యత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఆఖరికి ఈ నెల 21న విచారణ జరిగే సమాచారాన్ని కూడా గోప్యంగా ఉంచుతూ జాగ్రత్త పడ్డారని తెలిసింది. ఎలాగోలా విచారణను తూతూమంత్రంగా ముగిస్తే అనుకూలంగా నివేదిక రాయించి రిటైర్‌మెంట్ బెనిఫిట్స్, పింఛన్ మంజూరు అంశాల్లో భాస్కర్‌కుమార్‌కు వీలుగా ప్రయత్నాలు చేసేలా ప్రణాళికలు రచించినట్లు సమాచారం. దీని ఫలితంగా కొందరు జేబులు నింపుకొనే పనులు జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ అనిత వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా.. భాస్కర్‌కుమార్‌పై శనివారం జరగాల్సిన విచారణ తాత్కాలికంగా వాయిదా పడిందని, తదుపరి తేదీ త్వరలో ప్రకటించనున్నట్లు తెలిపారు.


