ఆర్చరీలో మెరిసిన ఒడిశా
జాతీయ స్కూల్ గేమ్స్‌లో 4 స్వర్ణాలు,
5 రజతాలు, 1 కాంస్య పతకం సొంతం
భువనేశ్వర్: 69వ జాతీయ స్కూల్ గేమ్స్ అండర్ 17 ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో ఒడిశా యువ ఆర్చర్లు అద్భుతమైన ప్రతిభ ప్రదర్శించారు. ఈ పోటీలు ఈ నెల 6 నుంచి 10 వరకు జార్ఖండ్‌లోని రాంచీలో జరిగాయి. రాష్ట్ర జట్టు మొత్తం 10 పతకాలు సాధించింది. వాటిలో 4 స్వర్ణాలు, 5 రజతాలు, 1 కాంస్యం ఉంది. జాతీయ స్థాయిలో రన్నరప్‌గా నిలిచింది. జాతీయ స్థాయిలో మహారాష్ట్ర మొదటి స్థానంలో నిలిచింది. ఒడిశా రెండో స్థానం చేజిక్కించుకోగా జార్ఖండ్ మూడో స్థానంతో సర్దిపుచ్చుకుంది. రాష్ట్ర పాఠశాలలు, సామూహిక విద్యా విభాగం ఆధ్వర్యంలో ఒడిశా రాష్ట్ర పాఠశాల క్రీడల సంఘం 18 మంది క్రీడాకారులతో ఒడిశా జట్టును రంగంలోకి దించింది. ఈ జట్టులో 11 మంది బాలికలు, ఏడుగురు బాలురు రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించారు. ఈ జట్టు అద్భుతమైన ప్రదర్శన రాష్ట్ర వ్యాప్తంగా యువ క్రీడా ప్రతిభను ప్రేరేపిస్తుందని, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించడానికి ఆశావహులైన అథ్లెట్లను ప్రోత్సహిస్తుందని భావిస్తున్నారు. మయూర్‌భంజ్ జిల్లా బరిపద యూజీపీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్థి రోహిత్ కుమార్ మరాండి అత్యుత్తమ ప్రతిభా క్రీడాకారుడిగా నిలిచాడు. అతడు వరుసగా 30 మీటర్ల ఇండియన్ రౌండ్, 30 మీటర్ల ఒలింపిక్ రౌండ్, మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో 3 బంగారు పతకాలు, 30 మీటర్లు, 20 మీటర్ల విభాగంలో ఒక రజత పతకాన్ని గెలుచుకున్నాడు. భువనేశ్వర్ కిట్ స్కూల్‌కు చెందిన రేష్మా మల్లిక్, రోహిత్‌తో కలిసి 30 మీటర్ల మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో బంగారు పతకాన్ని సాధించారు. కెంజొహర్ జిల్లాకు చెందిన సునీతా నాయక్ 60 మీటర్ల రీ కర్వ్ రౌండ్‌లో రజత పతకాన్ని, 60 మీటర్ల వ్యక్తిగత ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. 60 మీటర్ల రీ కర్వ్ రౌండ్‌లో సాబిత్రి పాత్రో (కెంజొహర్), తెన్షా మెహర్ (సుందర్‌గడ్), పంఖి భత్రా (భువనేశ్వర్) రజత పతకాలను గెలుచుకున్నారు. వీరందరి విజయంతో ఒడిశా పతకాల సంఖ్య గణనీయంగా పెరిగేందుకు దోహదపడిందని సర్వత్రా ఆనందం వ్యక్తం అవుతుంది.
ఆర్చరీలో మెరిసిన ఒడిశా


