చార్టర్ ప్రమాద స్థలం పరిశీలన
భువనేశ్వర్: రూర్కెలాలో ఇటీవల జరిగిన చార్టర్ (మినీ విమానం) ప్రమాద స్థలాన్ని రాష్ట్ర రవాణా, వాణిజ్య శాఖ మంత్రి బిభూతి జెనా సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా దుర్ఘటన తదనంతర చర్యలను పరిశీలించారు. అనుబంధ అధికార యంత్రాంగంతో చర్చించారు. ప్రమాదం దురదృష్టకరమని మంత్రి విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించేందుకు ప్రభుత్వం సకల ఏర్పాట్లు చేసిందన్నారు. భగవంతుని దయతో ఎటువంటి ప్రాణ హాని లేకుండా గట్టెక్కిందన్నారు ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా దర్యాప్తు జరుగుతోందని మంత్రి ప్రకటించారు.
పెరగనున్న చలిగాలులు
భువనేశ్వర్: రాష్ట్రంలో శీతల గాలులు తిరిగి వీస్తున్నాయి. రానున్న రెండు, మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు బాగా తగ్గే అవకాశం ఉంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా చలి పెరుగుతుందని వాతావరణ వర్గాల సమాచార. సోమవారం నుంచి ఉష్ణోగ్రత మరోసారి తగ్గింది. మేఘావృతం క్రమంగా తొలగిపోవడంతో ఉష్ణోగ్రత తగ్గి చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మేఘావృతమైన వాతావరణం నెలకొనడంతో ఉష్ణోగ్రత స్వల్పంగా పెరిగింది. ఫలితంగా శనివారం రాత్రి నుంచి చలి తీవ్రత తగ్గింది. అయితే ఇప్పుడు ఈ వ్యవస్థ బలహీనపడి మేఘాలు తొలగిపోవడంతో చలి పరిస్థితులు మళ్లీ తీవ్రమవుతాయని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. రానున్న రోజుల్లో చలి తీవ్రత కొనసాగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లల పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ వహించాల్సి ఉంది.
రోడ్డు కోసం ఆందోళన
కొరాపుట్: రోడ్డు నిర్మాణం కోసం పట్టణ వాసులు ఆందోళనకు దిగారు. సోమవారం నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రం నడిబొడ్డున ఉన్న ఐదో నంబర్ వార్డులోని నువాబందు వీధి వాసులు ఆందోళనకు దిగారు. ఈ వీధి గుండా రోజూ కోర్టు, కాలేజీ, వివిధ ప్రభుత్వ కార్యాలయాల కోసం వందలాది వాహనాలు ప్రయాణం చేస్తుంటాయి. ఈ వీధిలో గతంలో రోడ్డు బాగుండేది. కానీ ప్రభుత్వం డ్రైనేజీ నిర్మాణం చేయడంతో శిథిలమైంది. దీంతో కొత్త రోడ్డు నిర్మించాలని వీధి వాసులు డిమాండ్ చేస్తున్నప్పటికీ అధికారులు క్రమేణా వాయిదా వేస్తున్నారు. దీంతో స్థానిక కౌన్సిలర్ ఐ.మురళీ క్రిష్ణ నేతృత్వంలో ప్రజలు స్వచ్ఛందంగా ఆందోళనకు దిగారు. వీరికి సంఘీభావంగా ఆ మార్గంలోని దుకాణదారులు తమ షాపులు మూసి వేశారు. దీంతో సంబంధిత ఆర్‌అండ్‌బీ విభాగ ఇంజినీర్లు వచ్చి ఫిబ్రవరి 20వ తేదీలోపు రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
రామనగుడలో 89 వినతుల స్వీకరణ
రాయగడ: జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి ఆదేశానుసారం జిల్లాలోని రామనగుడ సమితి కార్యాలయంలో సోమవారం వినతుల స్వీకరణ కార్యక్రమం జరిగింది. జిల్లా అదనపు కలెక్టర్ నవీన్ చంద్ర నాయక్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రామనగుడ సమితి పరిధిలోని వివిధ ప్రాంతాల ప్రజల నుంచి 89 వినతులను అధికారులు స్వీకరించారు. ఇందులొ 74 వ్యక్తిగత సమస్యలు కాగా 15 గ్రామ సమస్యలుగా అధికారులుగుర్తించారు. వినతులను క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత శాఖ అధికారులు త్వరితగతిన పరిష్కరించాలని అదనపు కలెక్టర్ నవీన్ చంద్ర నాయక్ ఆదేశించారు. రామనగుడ సమితి ఽఅధ్యక్షులు రవిగొమాంగో, డీఎఫ్‌వో అన్నా సాహెబ అహోలే, ఇతర శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లిమ్మపొదొరో గ్రామానికి చెందిన దివ్యాంగుడు గౌరంగ పండకు ట్రైసైకిల్‌ను అధికారులు అందజేశారు.
చార్టర్ ప్రమాద స్థలం పరిశీలన
చార్టర్ ప్రమాద స్థలం పరిశీలన


