అందరూ చదువుకోవాలి
రాయగడ: విజన్–2036 కలలు సాకారం చేయాలంటే ప్రతీఒక్కరూ చదువుకోవాలని జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సరస్వతి మాఝి అన్నారు. స్థానిక గోవింద చంద్రదేవ్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో శనివారం నిర్వహించిన ఎస్‌ఐవోఎస్ (స్టేట్ ఇనిస్టిట్యూషన్ ఆఫ్ స్కూలీంగ్) అవగాహన, మాస్ ప్రవేశాలు కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విద్యతోనే వికాసం సాధ్యమన్నారు. అందువల్ల ప్రతీ ఒక్కరూ చదువుకోవాలని హితవు పలికారు. చదువు మధ్యలో ఆపేసి పనులు చేసుకుంటున్న చిన్నారులకు ప్రతీ శని, ఆదివారాల్లో ఉచితంగా చదువు చెప్పి పదో తరగతి పరీక్షలు రాసేందుకు ఈ అవకాశం కల్పిస్తుందన్నారు. 2036లొ రాష్ట్ర శతజయంతి నాటికి వికసిత్ ఒడిశా కలలు సాకారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం పరుగులు పెడుతుందని అన్నారు. ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నిమిత ప్రధాన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా అదనపు విద్యాశాఖ అధికారి భజన్ లాల్ మాఝి, పితామహాల్‌లోని సెంచూరియన్ విశ్వవిద్యాలయం ప్రాంతీయ డైరెక్టర్ డాక్టర్ రాజేష్ కుమార్ పాఢి, స్థానిక అటానమస్ కళాశాల ప్రిన్సిపాల్ సరస్వతి రాయ్ పాల్గొన్నారు. అనంతరం చదువుకునేందుకు ఆసక్తి కనబరిచిన వారి వివరాలను సేకరించి వారికి ఈ సందర్భంగా పుస్తకాలు, గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. ఓపెన్ స్కూల్‌లో చేరిన వారికి స్వాగతం పలికారు.
అందరూ చదువుకోవాలి
అందరూ చదువుకోవాలి
అందరూ చదువుకోవాలి


