నేడు కాంగ్రెస్ ఉపవాస దీక్షలు
రాయగడ: డబుల్ ఇంజన్ సర్కార్ పనితీరును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆదివారం ఉపవాస దీక్షలు చేపట్టనుందని సీఎల్పీ నాయకుడు రామచంద్ర కడమ్ అన్నారు. స్థానిక కాంగ్రెస్ భవనంలో శనివారం విలేకర్లతో మాట్లాడారు. దేశంలో కార్మికులకు వంద రోజుల ఉపాధి హామీ పథకం మనొరేగ పేరును మారుస్తూ కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనను తామంతా వ్యతిరేకిస్తున్నామన్నారు. మనొరేగ.. పథకం మాత్రమే కాదని పేదలు, కార్మికుల జీవనోపాధిని మెరుగుపరిచే సాధనమని అభిప్రాయపడ్డారు. దీని పేరులో గాంధీ అనే పదాన్ని మారుస్తూ కేంద్ర ప్రభుత్వం పెద్ద తప్పిదం చేసిందని దుయ్యబట్టారు. పేరు మార్పుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉపవాస దీక్షలు చేపట్టడంతోపాటు జనవరి 31 నుంచి ఫివ్రబరి 6వ తేదీ వరకు పంచాయతీ స్థాయిలో శాంతియుత ప్రదర్శనలను నిర్వహించి, తమ నిరసన తెలియజేస్తామన్నారు. అదేవిధంగా రైతు సమస్యలను ఎత్తిచూపడంతోపాటు విద్యుత్ బిల్లులపై వినియోగదారులుపడుతున్న పాట్లు తదితర సమస్యలకు సంబంధించి తాము ప్రజాపోరాటం చేస్తామని ప్రకటించారు. రాయగడ ఎమ్మెల్యే అప్పల స్వామి కడ్రక, ఆ పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ దుర్గాప్రసాద్ పండా, డీసీసీ సాధారణ కార్యదర్శి శంకర్షన్ మంగరాజ్, తదితరులు పాల్గొన్నారు.


