నేల కూలిన వన్ చార్టర్
ఆరుగురికి గాయాలు
వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స
భువనేశ్వర్: భువనేశ్వర్ నుంచి రూర్కెలాకు వెళ్తున్న ఇండియా వన్ ఎయిర్ ఫ్లైట్ శనివారం ప్రమాదానికి గురైంది. రూర్కెలా జల్దా సమీపంలో గమ్య స్థానానికి 8 నాటికల్ మైళ్ల దూరంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రమాదానికి గురైన 9 సీట్ల బుల్లి విమానంలో 2 మంది పైలట్లు, 4 మంది ప్రయాణికులు మొత్తం ఆరుగురు వ్యక్తులు ప్రాణాలతో బతికి బయటపడ్డారని అధికారులు నిర్ధారించారు. వీపీ కేఎస్‌ఎస్ రిజిస్ట్రేషన్ నంబర్ కలిగిన కారవాన్ 208 విమానం మధ్యాహ్నం 12.27 గంటలకు భువనేశ్వర్ నుంచి బయల్దేరింది. సాంకేతిక కారణాల వల్ల పైలట్లు బలవంతంగా ల్యాండింగ్ చేశారు. సిబ్బంది సమయ స్ఫూర్తి విమానంలో ఉన్న వారి ప్రాణాలను కాపాడటానికి సహాయపడిందని అధికారులు వివరించారు.
విమాన దుర్ఘటన సమాచారం అందిన వెంటనే జిల్లా యంత్రాంగం సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన పైలెట్లు, ప్రయాణికులను రూర్కెలాలోని వైద్య సదుపాయాలకు తరలించారు. అంతకు ముందుగా స్థానిక గ్రామస్తులు చొరవ కల్పించుకుని బాధితులకు చేయూతనిచ్చి మానవీయత చాటుకున్నారు. అగ్ని మాపక సిబ్బంది సకాలంలో రంగంలోకి దిగి విమానంలో మంటలు చెలరేగకుండా సత్వర చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ముగ్గురు ప్రయాణికులు జేపీ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా ఇద్దరు పైలెట్లు, ఒక ప్రయాణికుడు రూర్కెలా ప్రభుత్వ ఆస్పత్రి (ఆర్‌జీహెచ్)లో చికిత్స పొందుతున్నారు. గాయపడిన వారందరూ వైద్య పరిశీలనలో ఉన్నారని, ఎలాంటి మరణాలు సంభవించలేదని అధికారులు ధ్రువీకరించారు. ఈ ల్యాండింగ్ ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను అధికారులు అంచనా పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఈ సంఘటనను పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పరిధిలోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)కి నివేదించారు. ఈ బృందం తక్షణమే ఘటనా స్థలం సందర్శిస్తుంది. విమానయాన నిబంధనల ప్రకారం తదుపరి దర్యాప్తు కోసం ఎయిర్‌లైన్ డీజీసీఏ, ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ)కి వివరణాత్మక నివేదికను సమర్పిస్తుంది. ఈ బృందం ఆదివారం ఉదయం సరికి ఘటనా స్థలం చేరుతుంది.
ఘోర ప్రమాదం తప్పింది: మంత్రి
రూర్కెలాలో విమానం కూలిపోవడంతో ఆరుగురు గాయపడ్డారు. వారందరి పరిస్థితి స్థిమితంగా కొనసాగుతుంది. భగవంతుని దయ వల్ల ఘోర ప్రమాదం తప్పిందని రాష్ట్ర వాణిజ్య, రవాణా విభాగం మంత్రి బిభూతి భూషణ్ జెనా తెలిపారు. రూర్కెలా రఘునాథ్‌పల్లి జల్దా ఎ బ్లాక్‌లో జరిగిన చార్టర్ విమానం కూలిపోవడంతో ఆరుగురు గాయపడ్డారని రవాణా మంత్రి తెలిపారు. విమానంలో నలుగురు ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది ఉన్నారు.
ప్రయాణికులలో సుశాంత్ కుమార్ బిస్వాల్, అనితా సాహు, సునీల్ అగర్వాల్, సబితా అగర్వాల్ ఉన్నారు. గాయపడిన 2 మంది సిబ్బందిలో కెప్టెన్ నవీన్ కడంగా, కెప్టెన్ తరుణ్ శ్రీవాస్తవ ఉన్నట్లు మంత్రి పేర్కొన్నారు.
భువనేశ్వర్ నుంచి రూర్కెలాకు వెళ్తున్న ఈ విమానం 9 సీట్ల విమానం ఏ పరిస్థితులలో కూలిపోయిందో స్పష్టంగా తెలియదు. ఇది క్రాష్ ల్యాండింగ్ కాదు. ఫోర్స్ ల్యాండింగ్ అని స్థానిక బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం డైరెక్టర్ ప్రసన్న ప్రధాన్ తెలిపారు. ఇంజిన్‌లో లోపంతో అనివార్య ల్యాండింగ్ జరిగి ఉండవచ్చన్నారు. చార్టర్ విమానం ల్యాండింగ్‌కు 15 నిమిషాల ముందు ఫోర్స్ ల్యాండింగ్ చేసింది. 9 మంది ప్రయాణించే విమానం భువనేశ్వర్ నుంచి రూర్కెలాకు వెళుతోంది. ఏ పరిస్థితుల్లో అది కూలిపోయిందో స్పష్టంగా తెలియదు. డీజీసీఏ బృందం సాయంత్రం సరికి చేరుకుంటుంది. ఆదివారం నాటికి ఏఏఐబీ బృందం రూర్కెలాకు చేరుకుంటుందని సమాచారం. సమన్వయం కోసం భువనేశ్వర్ పౌర విమానయాన డైరెక్టరేటు నుంచి ఇద్దరు ఉద్యోగులు ఘటనా స్థలానికి వెళ్లారు. రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఈ సంఘటనను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. మొబైల్ నంబర్ 9861096371, 0674– 2596371 కు కంట్రోల్ రూమ్ సిస్టమ్ జారీ చేయబడింది.
ముఖ్యమంత్రి విచారం
రూర్కెలా విమాన ప్రమాదంపై ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు. భగవంతుని దయవల్ల ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారనే వార్త ధైర్యాన్నిస్తోంది. గాయపడిన వారికి ఉత్తమ వైద్య సహాయం అందించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి స్వయంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. అందరూ త్వరగా కోలుకోవాలని ముఖ్యమంత్రి శ్రీ జగన్నాథుని వేడుకున్నట్లు తెలిపారు.
నేల కూలిన వన్ చార్టర్
నేల కూలిన వన్ చార్టర్
నేల కూలిన వన్ చార్టర్


